రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ దొరుకుతోంది కానీ, నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యేలమైన తమకు ముఖ్యమంత్రి రేవంత్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా కలిసేందుకు అవకాశం ఇస్తున్నారని.. కానీ, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలవకపోవడం బాధాకరమన్నారు. గడిచిన నెల రోజులుగా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి సమయం ఇవ్వడం లేదన్నారు. కనీసం నెలరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో ప్రతిపాదించామని ఎమ్మెల్యే సూర్యనారాయణ చెప్పారు. అలాగే, అసెంబ్లీ మెటీరియల్ హిందీలో కూడా ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు గంటలకు గంటలు మాట్లాడేంత సమయం ఇస్తున్నారని, కానీ, ఎనిమిది మంది ఎమ్మ్ఎల్యేలున్న బీజేపీ సభ్యులకు మాత్రం పదినిమిషాలు కాగానే మైక్ కట్ చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీజేపీకి కూడా తగిన సమయం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు.