తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీలో అధికార పక్షం అర్థవంతమైన చర్చ చేయడం లేదని, అలాంటప్పుడు బీఏసీ ఎందుకని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని బయటకు వచ్చామన్నారు హరీష్‌రావు. ఎన్ని రోజులు సభ నడుపుతారో కూడా చెప్పకపోవడంతోనే బీఏసీ నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. లగచర్ల అంశంపై అసెంబ్లీలో చర్చించాల్సిందేనని హరీష్‌రావు డిమాండ్ చేశారు. రైతులకు బేడీలు వేసిన అంశం చాలా కీలకమన్నారు. హౌస్ కమిటీలను ఏర్పాటుచేయాలన్నారు. అలాగే, పీఏసీ కమిటీపైనా బీఆర్‌ఎస్ అభిప్రాయం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని హరీష్‌రావు ఈ సందర్భంగా స్పీకర్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ ఉల్లంఘనలపై మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకుంటామని స్పీకర్ హమీ ఇచ్చారని హరీష్‌రావు చెప్పారు. ప్రతిరోజు జీరో అవర్ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్యమేరకు మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరామన్నారు.