మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొత్తం 15 రాష్ట్రాల్లో 50 స్థానాలకు (48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు) ఉప ఎన్నికలు జరిగాయి. మెజారిటీ రాష్ట్రాల్లో అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్‌లో 9 స్థానాలకు, రాజస్థాన్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 6, అస్సాంలో 5, పంజాబ్‌లో 4, బీహార్‌లో 4, కర్ణాటకలో 3, కేరళలో 2, సిక్కింలో 2, మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, గుజరాత్‌లో 1, మేఘాలయలో 1, ఉత్తరాఖండ్ కేదరినాథ్ శాసనసభ స్థానానికి ఎన్నికలు జరిగాయి. కేదర్ నాథ్ లో బిజెపి విజయం సాధించింది.
వయనాడ్ ఎంపి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలవగా… నాందేడ్ ఎంపి స్థానంలో బిజెపి అభ్యర్థి శంతుక్ రావ్ మరోత్ రావ్ హంబార్డే విజయం సాధించారు.
కర్ణాటకలోనే మూడు స్థానాల్లో మహామహులు బరిలో ఉన్నారు. చెన్నపట్నం నుంచి JDS మూడవ తరం నాయకుడు, కేంద్రమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి NDA కూటిమి తరపున పోటీ చేయగా అతనిపై ఐదుసార్లు ఎమ్మెల్యే CP యోగేశ్వర్ కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయంసాధించారు.
షిగ్గావ్‌లో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై బీజేపీ నుంచి టికెట్ మీద పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. సండూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత తుకారాం భార్య అన్నపూర్ణ బిజెపి అభ్యర్థి బంగారు హనుమంతుతో తలపడ్డారు.
గుజరాత్ వావ్ అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థి విజయం సాధించారు. చత్తీస్ ఘడ్లో జరిగిన ఒక స్థానంలో బిజెపి గెలిచింది. పంజాబ్ లో నాలుగు స్థానాలకు గాను ఆప్ మూడు స్థానాలు గెలుచుకుంది. ఒక స్థానంతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. అస్సాంలో 5 స్థానాలకు గాను ఎన్ డి ఏ కూటమి గెలుచుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో 9 శాసనసభ స్థానాలకు గాను 2 SP, ఏడింటిలో BJP ఆధిక్యంలో ఉంది. కతేహరి రిజర్వుడు స్థానంలో 33 ఏళ్ల తర్వాత కమలం జెండా వికసించింది. సమాజ్ వాది పార్టీకి కంచుకోటగా ఉన్న కుంద్రేకీ స్థానంలో 31 ఏళ్ల తర్వాత బిజెపి పాగా వేసింది.
పశ్చిమ బెంగాల్లో 6 సీట్లకు గాను ఐదు సీట్లు గెలుచుకున్న అధికార పార్టీ టిెఎంసి మరో స్థానంలో విజయానికి చేరువలో ఉంది. తాజా ఫలితాలతో ముఖ్యమంత్రి మమత బెనర్జీ రాష్ట్రంపై తన పట్టు నిరూపించారు. ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా తృణమూల్ కాంగ్రెస్ విజయాన్ని బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు నిలువరించలేకపోయాయి.
Rajasthan – bjp-5, congres-1, BAP-1 రాజస్థాన్లో అధికార పార్టీ బిజెపి విజయ ఢంకా మోగించింది. సచిన్ పైలట్ కు పట్టు ఉన్న దౌసాలో గెలిచి కాంగ్రెస్ పరువు దక్కించుకుంది. సిక్కింలోనే రెండు స్థానాలను అధికార సిక్కిం క్రాంతికారి పార్టీ కైవసం చేసుకుంది.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందర.. బీహార్‌లోని అధికార ఎన్‌డిఎ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇమామ్‌గంజ్‌ను నిలుపుకోవడమే కాకుండా ఇండియా కూటమి నుంచి తరారీ, రామ్‌ఘర్, బెలగంజ్‌లను కూడా చేజిక్కించుకుంది.
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలి, అటవీ శాఖ మంత్రి రాంనివాస్ రావత్ విజయ్‌పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ మల్హోత్రా చేతిలో 7,364 ఓట్ల తేడాతో ఓడిపోయారు. షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్ నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రావత్, 2023లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి బీజేపీలోకి ఫిరాయించడంతో మోహన్ యాదవ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
మేఘలయాలోని పశ్చిమ గారో హిల్స్ జిల్లాలోని గంబెగ్రే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా భార్య మెహతాబ్ చండీ సంగ్మా విజయం సాధించారు.