కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై మరోసారి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ఐదెకరాల స్థలం కొన్నారు. తాను నివసించేందుకు అనువుగా ఇల్లు నిర్మించుకునేందుకు ఆ భూమి కొన్నారని చంద్రబాబు సన్నిహితులు చెబుతున్నారు. ఆ స్థలం కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్‌కు సమీపంలో ఉంది. దీంతో, భవిష్యత్తులో ఆ ప్రాంతాన్ని మరో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మాదిరిగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని చెప్పుకుంటున్నారు. అమరావతిని మళ్లీ ఏపీ రాజధానిగా ప్రకటించిన తర్వాత కొన్నాళ్లుగా ఆ ప్రాంతంలో భవనాల పునరుద్ధరణ, ఆ ప్రాంతం అభివృద్ధిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. దీంతో, ఇప్పటికే వెలగపూడిలో స్థలాలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా నివాసస్థలం కొనుగోలు చేయడంతో ఆ ప్రాంతంలో రియల్ జోరు మరింతపెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం నుంచే ఆ ప్రాంతంలో నివాస స్థలం కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఐదెకరాల స్థలం ఆయనకు నచ్చింది. వెంటనే స్థలం యజమానులతో మాట్లాడించి కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు. ఇంటి భవనాల నిర్మాణం కోసం అక్కడ మట్టి పరీక్షలు కూడా చేయిస్తున్నారు. తన కుటుంబం నివాసం కోసం అక్కడ విశాలవంతమైన భవనంతో పాటు క్యాంప్ ఆఫీస్ కోసం మరో భవనాన్ని నిర్మించుకునే ఆలోచనలో చంద్రబాబు వున్నట్లు సమాచారం. ఇక, సెక్యూరిటీ సిబ్బంది, తన ప్రాంగణంలో పనిచేసే సిబ్బంది కోసం మరికొన్ని నిర్మాణాలు కూడా చేయనున్నారు. మిగతా ప్రాంతంలో వాహనాల పార్కింగ్, పచ్చటి ఉద్యానవనాన్ని ఏర్పాటుచేసేందుకు ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నారు. అది ఇంకా నిర్మాణ దశలో వుంది. ఇప్పుడు రాజధాని అమరావతిలో మరో ఇల్లు కట్టుకోవడానికి ఆయన సిద్దమయ్యారు. పాలనా వ్యవహారాలను చూసుకోవడంతో పాటు రాజధానిలో అందుబాటులో ఉండేందుకు అనువుగా చంద్రబాబు అక్కడ ఇంటినిర్మాణ ప్లాన్ తయారు చేయిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కుప్పంలో కడుతున్న ఇంట్లో చంద్రబాబు గానీ, ఆయన కుటుంబసభ్యులు గానీ నివసించే అవకాశం లేదని, ఇప్పుడు వెలగపూడిలో నిర్మించనున్న ఇంట్లోనే చంద్రబాబు నివసించేందుకు అనువుగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని చెబుతున్నారు.