ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు వైయస్‌ఆర్‌సీపీ సిద్దమైంది. ఇప్పటివరకు జిల్లాల వారిగా స్థానిక నేతలు ఆందోళనలు నిర్వహించగా… ఇక నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా క్షేత్రంలోకి రానున్నారని తెలిసింది. ఇందుకు ఈ నెల 11వ తేదీ ముహూర్తంగా ఖరారైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. నేతలు, కార్యకర్తలతో జగన్ నేరుగా సమావేశం అవుతారని అంటున్నారు.
ఉద్యమ బాటలో భాగంగా పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయ పోరాటం సాగించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు దఫాలుగా జిల్లాల నాయకులతో జగన్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న తరుణంలో జగన్ సీరియస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.