25.2 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

యంగ్ ఇండియా నా బ్రాండ్

ఉమ్మడి రాష్ట్రం పాలించిన ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రెండు రూపాయాల కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్ ను గుర్తుంచుకుంటారని తెలిపారు. అలాగే ఇవాళ నేను క్రియేట్ చేసిన నా బ్రాండ్ “యంగ్ ఇండియా” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

హైదరాబాద్‌ మంచిరేవుల సమీపంలోని పోలీస్‌ గ్రేహౌండ్స్‌ క్యాంపస్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు

దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.  అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది మా బ్రాండ్. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.

వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోంది. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి… ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం

సైనిక్ స్కూల్ కు ధీటుగా పోలీస్ స్కూల్ ను తీర్చి దిద్దాలి. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత.  సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలి . పోలీస్ స్కూల్ కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com