33.9 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

సంక్రాంతికి వస్తామన్నారు.. ఉగాదికైనా వస్తారా?

– అధినేతల మౌనం వెనుక వ్యూహం
– తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం
– క్షేత్రస్థాయి పర్యటనలపై జనం ఆసక్తి

ఆ ఇద్దరూ రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రులు కూడా… గడిచిన ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వాళ్ల ఇద్దరిదీ తమ పార్టీలకు పునర్వైభవం తీసుకురావాలన్న ఆకాంక్షే. అయితే, తమదైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ సరైన సమయం కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే… మొన్నటి వరకు ఇద్దరూ కాస్కోండి మా అడుగులు.. ఇక ముందుకు వేస్తున్నాం అంటూ ప్రచారం సాగించారు. ఆ రెండు పార్టీల క్యాడర్ కూడా ఓకే మేం రెడీ… అనే రేంజ్‌లో సిద్ధమైపోయారు. చివరకు ఆ చల్లని కాలం ముగిసింది. కానీ, వాళ్లిద్దరూ ఇప్పటికీ క్యాడర్‌లోకి రాలేదు. క్షేత్రస్థాయిలోకి తొంగిచూడలేదు. దీంతో, అసలు తమ పార్టీ అధినాయకుల మనసులో ఏముందో అనే సందిగ్ధంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు పడిపోయారు. వాళ్లు ఎప్పుడు క్షేత్రంలోకి వస్తారని ఎదురుచూపులు చూస్తున్నారు.

ఆ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌. ఆ రెండు పార్టీలు.. ఒకటేమో భారత రాష్ట్రసమితి అయితే, రెండోది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఇక, ఆ ఇద్దరు అధినేతలు, మాజీ ముఖ్యమంత్రులు ఎవరంటే.. ఒకరేమో కేసీఆర్‌. మరొకరేమో జగన్‌మోహన్‌రెడ్డి. అధికారంలో ఉన్నన్ని రోజులు సాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వీళ్లిద్దరూ భాయ్.. భాయ్ మాదిరిగానే ఉన్నారు. ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో అయితే రానున్నది జగన్ రాజ్యమేనంటూ మాజీ సీఎం కేసీఆర్ జోస్యం కూడా చెప్పారు. అయితే, ఫలితం తారుమారైంది. తెలంగాణలో కేసీఆర్ మాజీ అయ్యారు. ఏపీలోజగన్ కూడా మాజీ అయ్యారు. ఇద్దరికీ ఎన్నికలు కోలుకోలేని దెబ్బతీశాయని ఎన్నికల ఫలితాలను బట్టి చెప్పవచ్చు. తెలంగాణలో అయితే ఎంపీ ఎన్నికల్లో ఏమాత్రం ఉనికి చాటుకోలేదు బీఆర్‌ఎస్‌.

అయితే, కాస్త సమయం తీసుకొని అయినా… వీరిద్దరూ తమ తమ పార్టీలకు పునర్వైభవం తెచ్చేందుకు సమాయత్తమయ్యారు. సంక్రాంతి ముందు వరకు ఇద్దరిదీ ఒకటే మాట.. ఒకటే బాటలా టాక్ నడిచింది. జనవరి నెలాఖరున జనంలోకి వస్తున్నామని ఇద్దరూ ప్రకటించారు. దీంతో, సంక్రాంతి తర్వాత ఇద్దరూ ప్రజాక్షేత్రంలోకి వచ్చేస్తారని, ఆయా పార్టీల శ్రేణులే కాదు.. జనం కూడా ఎదురుచూశారు. తెలంగాణలో కేసిఆర్, ఏపీలో జగన్ ఒకేసారి జనంలోకి వస్తారని ఆయా పార్టీల క్యాడర్ కూడా భావించారు. కానీ, చివరకు డ్యామిట్.. కథ అడ్డం తిరిగిందనే తరహాలో.. ఇద్దరూ బయటకు రాలేదు. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాలలో కోడ్ అమల్లోకి వచ్చింది.ఇప్పటికే జనంలోకి వచ్చి పర్యటన సాగించి ఉంటే దాని ఫలితం వేరేలా ఉండేదని, ఇప్పుడు వచ్చినా ఎన్నికల హంగామా కిందికే పోతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఏపీలో వైసీపీ పరిస్థితి అయితే కొందరు పెద్ద క్యాడర్ నాయకులు గుడ్ బై చెప్పడంతో క్యాడర్ చిన్నబుచ్చుకున్నారట. ఏకంగా విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో పార్టీలో కాస్త సైలెంట్ వార్ జరుగుతుందా అనే ప్రశ్నలను క్యాడర్ లేవనెత్తుతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలో కేసిఆర్ అయితే ఇటీవల సమావేశం నిర్వహించి నేను.. వస్తున్నా అంటూ మరోమారు తన వాణి వినిపించారు. నేను కొడితే మామూలుగా ఉండదంటూ ఓ ఝలక్‌ ఇచ్చారు కూడా. అదే తీరులో విదేశీ పర్యటన ముగించుకున్న జగన్ కూడా కేసీఆర్ రూట్ లోనే వస్తున్నా.. అంటూ ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది. అంటే.. ఉగాదికి ఈ ఇద్దరు నేతలు జూలు విదుల్చుకొని బయటకు వస్తారన్న చర్చ.. ఆయా పార్టీల క్యాడర్‌లో జోరుగా సాగుతోంది. మరోవైపు.. అసలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల ప్రభావం కనుమరుగైతే, ప్రజల్లో పార్టీల స్థితిగతులపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే క్యాడర్ చేజారి పోతున్న వేళ, వీళ్లిద్దరూ వేస్తున్న ప్లాన్స్ ఎవరికీ అంతుబట్టడం లేదట. మరి.. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ పార్టీల క్యాడర్‌కి భరోసా కల్పించేందుకు, తమ పార్టీలను కాపాడుకొనేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నది.. ఏ దారుల్లో పయనిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

 

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com