దేశంలో అన్ని రాష్ట్రాలకు బిజెపి అధ్యక్షులను ఎంపిక చేస్తున్న జాతీయ నాయకత్వం తెలంగాణకు కమలనాథున్ని తీసుకురావటంలో ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తాత్కాలికంగా కొనసాగిస్తోంది. తాత్కాలికం పేరుతో కిషన్ రెడ్డి 15 నెలలుగా కొనసాగుతున్నారు. ఇలా ఇంకెన్నాళ్లు నెట్టుకొస్తుందో తెలియని సందిగ్ధం నెలకొంది.
రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు రేసులో ఉన్న నేతలు కూడా నీరస పడే పరిస్థితి ఏర్పడింది. ఎంపీలు ఈటెల రాజేందర్, డికె అరుణల మధ్య ప్రధానంగా పోటీ ఉందని సమాచారం. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, మరో ఎంపి రఘునందన్ రావు పేర్లు తెరమీదకు వచ్చాయి.
ముగ్గురు ఎంపీల్లో ఎవరికి కట్టబెట్టినా పార్టీ బలోపేతానికి ఢోకాలేదని, ఎన్ రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇస్తే ఇక అంతే సంగతులు అనే టాక్ పార్టీలో మొదలైంది. ఇటీవల పార్టీ సమావేశాల్లో ఎంపీ ఈటెల రాజేందర్ మాట తీరు విశ్లేషిస్తే ఆయనకే అధ్యక్ష పగ్గాలు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. డికె అరుణను ఎంపిక చేసినా బాగుంటుందని, ముఖ్యమంత్రిని బలంగా ఢి కొంటుందని నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డికె అరుణ ఇద్దరు ఒకే జిల్లా వారు కావడంతో రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతుందని పాలమూరు నేతలు చర్చిస్తున్నారు.
మరోవైపు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ రేసులో ఉన్నారని వినికిడి. అరవింద్ కు పగ్గాలు ఇస్తే మాస్ లీడర్ గా పార్టీని ముందుకు తీసుకువెళతారని ఆయన మద్ధతుదారులు చెపుతున్నారు.
ఈటెల రాజేందర్, డికె అరుణ విషయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అని చర్చ జరిగినా అదంతా ప్రాధాన్యతాంశం కాదని తేలిపోయింది. పార్టీ బలోపేతం కావాలంటే ఫైర్ ఉన్న నాయకులు కావాలని జాతీయ నాయకత్వం స్పష్టమైన ఆలోచనతో ఉంది. ఇందుకు నలుగురు ఎంపీల్లో ఎవరిని ఎంపిక చేసినా బాగుంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది.