భారత్‌కు అమెరికా చేస్తున్న ఆర్థిక సాయంపై ఇప్పటికే దుమారం రేగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న రోజుకో ఆరోపణ.. భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది. లెటెస్ట్‌గా ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే.. భారత్‌లో ఎవరినో గెలిపించేందుకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నించినట్టు ఆరోపించారు. అంతేకాదు.. అది ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోదీనైతే కాదంటూ తెలిపారు. దీంతో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది.
మొత్తం 21 మిలియన్ డాలర్లు అంటే 181 కోట్ల రూపాయలు వోటర్ టర్నవుట్‌కు సాయం అందించింది యూఎస్ ఎయిడ్. ఎవరికి ఇచ్చారు.. ఏం చేశారు.. ఎలా ఖర్చు చేశారన్న అంశం చుట్టూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఈ ఎపిసోడ్‌లో ఏపీ మూలాలున్న వీణారెడ్డి ముఖ్య పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె యూఎస్ ఫారిన్ సర్వీసెస్‌లో సీనియర్ అధికారిగా ఉన్నారు. US- AID డిపార్ట్‌మెంట్‌లో చాలా కాలం ముఖ్య పాత్ర పోషించారు. భారత్, భూటాన్ మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. అమెరికా ఇచ్చిన ఈ నిధులను వీణారెడ్డి ఎలా ఖర్చు చేశారు.. ఎవరికి ఇచ్చారన్న కోణంలో బీజేపీ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ X వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
2021లో వీణారెడ్డిని US-AID ఇండియా మిషన్ కోసం పంపారని, 2024 లోక్ సభ ఎన్నికలు పూర్తవగానే ఆమె తిరిగి అమెరికా వెళ్లిపోయారన్నారు. అయితే ఆమె ఆ నిధులను భారత్‌లో ఓటింగ్ శాతం పెంచే కార్యక్రమాల కోసం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎన్నికల సంఘం ఓటర్లలో చైతన్యం కలిగించే ప్రకటనలు, పోస్టర్లు, ఆడియో, వీడియో సందేశాలు ఇలా రకరకాల రూపాల్లో నిధులను వాడాల్సి ఉంటుంది. అయితే ఆ ఫండ్స్‌ను ఎవరికి ఇచ్చారు అని బీజేపీ నేతలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో భారత ప్రయోజనాలను దెబ్బతీసే విదేశీ శక్తులకు రాహుల్ ఆయుధంగా మారారని బీజేపీ ఫైర్ అవుతోంది. వీటికి కౌంటర్ గా దశాబ్దాలుగా US – AID ద్వారా భారత్‌లోని సంస్థలకు అందుతున్న సాయానికి సంబంధించి వైట్ పేపర్ ను కేంద్రం రిలీజ్ చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు.
యూఎస్ ఎయిడ్ ద్వారా వివిధ దేశాలకు అమెరికా నుంచి అందుతున్న సాయానికి సంబంధించిన లిస్ట్ ను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇటీవలే రిలీజ్ చేసింది. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు 181 కోట్లు ఇచ్చారని మెన్షన్ చేశారు. 21 మిలియన్లు మొత్తంగా భారత్‌కు రాలేదని కొందరు.. వచ్చాయని ఇంకొందరు.. బంగ్లాదేశ్ కు ఇచ్చిన వాటిని ఇండియా ఖాతాలో వేశారని, ఇలా రకరకాల అనుమానాలైతే పెరుగుతున్నాయి. భారత్‌లో పోలింగ్ శాతం పెరగడానికి ఈ 181 కోట్లు ఎటుసరిపోతాయన్న ప్రశ్నలను ఇంకొందరు వినిపిస్తున్నారు.