ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఏదో జరిగిపోతుందని అందరూ ఊహించారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పదే పదే నేతలు చెబుతున్నప్పటికీ పెద్దగా అమలు కావడం లేదు. లబ్ది దారులకు అందించే పింఛన్ల మొత్తాన్ని రూ.4 వేలకు పెంచడం మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదన్న కామెంట్స్ క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నా మహిళలు అంత సంతోషంగా లేరన్నది కూడా అంతే వాస్తవం అంటున్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతకు మించి ఇప్పటి వరకూ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడంపై జనంలో వ్యతిరేకత వస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా అదిగో.. ఇదిగో అంటూ తేదీలు మారుస్తూ జాప్యం చేస్తుండటంతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆశలు సన్నగిల్లాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక రాష్ట్రంలో ప్రధానంగా ప్రభావం చూపగలిగే రైతులు కూడా ఆందోళనలోనే ఉన్నారు. ఏ పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో గత ప్రభుత్వమే మేలన్న అభిప్రాయానికి అన్నదాతలు వచ్చే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక, మిర్చి రైతులను ఆదుకుంటున్నామని సర్కారు హడావిడి చేసినప్పటికీ.. ఆ ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయన్న వాదన బలపడుతోంది. ఏ పంటకు కూడా సరైన ధర లభించడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇంకో వైపు.. అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ.. డబ్బులు తమ అకౌంట్లలో పడేదాకా ఎవరికీ నమ్మకం లేదంటున్నారు. ఎందుకంటే.. ఈ పథకం విషయంలో లబ్దిదారుల ఎంపిక ఎలా ఉంటుంది? జాబితాను ఎలా వడపోస్తారు. ఆ లిస్టులో తమ పేరు ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు కూడా కర్షకులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
అటు.. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం గురించి ఊదరగొట్టినంతగా ఆ పథకం గురించి ఊసే లేకుండా పోయింది. మరో వైపు.. పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనాలు అందజేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఆ పథకం పేరు కూడా పలకడం లేదు.
గడిచిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదో ఒక రూపంలో డబ్బులు వచ్చేవని, చేతుల్లో, బ్యాంకు అకౌంట్లలో అవసరానికి డబ్బులు అందుబాటులో ఉండేవని జనం అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క పైసా కూడా తమకు అందలేదన్న నిరాశా, నిస్పృహలు అయితే క్షేత్ర స్థాయిలో బాగా కనపడుతున్నాయంటున్నారు.
కూటమి ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా నిధులు లేవంటూ ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతుండటంతో తమకు ఇప్పట్లో అవి అందే అవకాశం లేదన్న నిర్ణయానికి జనం వచ్చేశారని చెబుతున్నారు. అయితే, బాహాటంగా మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం గానీ, విమర్శలకు గానీ ముందుకు రావడం లేదు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా ఎన్నికలకు ముందు ఇలాగే భావించారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందని, తాము అమలు చేస్తున్న పథకాలే తిరిగి తమ పార్టీని గెలిపిస్తాయని వైఎస్ జగన్ గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. కానీ, ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పుడు కూడా కూటమి పార్టీల పరిస్థితి అలాగే ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈయన కంటే ఆయనే బెటర్ అన్న భావన ఇప్పటికే ప్రజల్లో వచ్చేసిందని, ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగితే ఆ వాదన బలపడే అవకాశం ఉందంటున్నారు.
అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో తీసుకెళుతున్నామని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనం మాత్రం అంతగా సంతృప్తికరంగా లేరన్నది వాస్తవమంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో కొంత ఇబ్బంది పడుతున్నారట. జనంలోకి వెళ్లి వారికి నచ్చ చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితం ఇవ్వడం లేదంటున్నారు. కొన్నిచోట్ల అయితే, మహిళలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారుల నుంచి వచ్చే నివేదికలను కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటే మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.