- బీజేపీ దక్షిణాది రాష్ట్రాలను ఎదగనివ్వదు
- అధిష్టానం అనుమతితో స్టాలిన్ సమావేశానికి వెళతా
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి
డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం విషయంలో స్టాలిన్ చూపిస్తున్న చొరవ అభినందనీయం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీయం రేవంత్‌రెడ్డిని డీఎమ్‌కే ప్రతినిధులు కలసి మార్చి 22వ తేదీన తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం సీయం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూఏఐసీసీ అనుమతి తీసుకుని 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఎన్‌డీఏ ని లీడ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణ సీయం తీవ్ర స్ధాయిలో విమర్శించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలను ఎదగనివ్వదని అందుకే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు లిమిటేషన్ విధించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఉత్తర భారత రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ పన్నులు వసూలు అవుతాయాన్న రేవంత్‌రెడ్డి బీజేపీ డీలిమిటేషన్ ద్వారా కుట్రపన్ని మా అవకాశాలను లిమిట్ చెయ్యాలని చూస్తోందని ఆరోపించారు.
కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టడానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిచుకోవడానికే స్టాలిన్ అధ్యక్షతన ఈనెల 22వ తేదీన చెన్నైలో జాయిట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుందని, మా అధిష్టానం అనుమతితో నేను కూడా హాజరవుతానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం చెయ్యాలనుకుంటున్న డీలిమిటేషన్ ప్రక్రియ ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తుందని అటువంటి నియోజకవర్గాల పునర్విభజనను మేము ఎట్టి పరిస్ధితుల్లో అంగీకరించమని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పౌరసంఘాలు పాల్గొని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ చేస్తున్న కుట్రలను ఎలా తిప్పికొట్టాలన్నదానిపై కార్యాచరణను రూపొందిస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో స్టాలిన్ చొరవ తీసుకుని కీలక పాత్ర పోషిస్తున్నారని మేమంతా ఆయనకు వెన్నంటి ఉంటామని రేవంత్‌రెడ్డి చెప్పారు.
త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణకు ఏవిధంగా అన్యాయం జరగబోతోందో చర్చించడానికి మా రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యవహారమని, చర్చలకు తెలంగాణ బీజేపీని కూడా ఆహ్వానిస్తామని అన్నారు. ముఖ్యంగా ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా రావాలని కోరుతున్నామని, ఆయనే ముందుండి దక్షిణాది రాష్ట్రాల తరపున పోరాడాలని రేంవత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయంపై కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి గళం విప్పాలని సీయం రేవంత్‌రెడ్డి సూచించారు.