తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదోరోజు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైరయ్యారు. అసెంబ్లీ సాక్షిగా పార్లమెంటరీ పదాలే వాడాలని, కానీ.. బీఆర్‌ఎస్ సభ్యులు మాత్రం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండి పడ్డారు. సభా నాయకుడైన ముఖ్యమంత్రిని పట్టుకొని అజ్ఞానం అనే పదం ఉపయోగించడం సరికాదన్నారు. అలాగే, కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి మాంద్యం ఉందనడం కూడా సభా సంప్రదాయం కాదని డిప్యూటీ సీఎం హితవు పలికారు. కనీసం సభాపతిని కూడా గౌరవించడం లేదని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైతే స్పీకర్ చెప్పింది విని తన వ్యాఖ్యలను హరీష్ రావు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు చర్చను పక్కదారి పట్టిస్తూ మాట్లాడటం సరికాదన్నారు. బడ్జెట్‌పై ఏ సందేహాలున్నా మాట్లాడాలని, వాళ్ల దగ్గర ఏవైనా లెక్కలు ఉన్నా ప్రస్తావించాలని సూచించారు. తాను వాటిని రాసుకొని మరీ సమాధానాలు ఇస్తానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్పీకర్‌తో కూడా వాగ్వాదం చేయడం సరైంది కాదన్నారు. తమకు బుద్ధి ఉందో, వాళ్లకు బుద్ధి ఉందో లెక్కలు వేసుకొని చెబుతామన్నారు. సభా నాయకుడు, ప్రభుత్వ పెద్దల గురించి మాట్లాడే టప్పుడు సరైన భాష ఉపయోగించాలని హరీష్‌రావుకు ఆయన సలహా ఇచ్చారు. బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలుగా మాట్లాడటం సబబు కాదని గ్రహించాలన్నారు.
హరీష్ రావు గతంలో మంత్రిగా పనిచేశారని, శాసన సభా వ్యవహారాలు కూడా చూసుకున్నారని, అలాంటి నాయకుడు ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. మొన్నటికి మొన్న వాళ్ల పార్టీ సభ్యుడు జగదీష్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడారని, ఇప్పుడు హరీష్ రావు కూడా సభా పతి పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని, ఈ వాలకం చూస్తుంటే వాళ్లంతా అదే ఆలోచనతో ఉన్నట్లు అర్థమవుతోందని భట్టి విక్రమార్క ఆక్షేపించారు.