ఆనాడు ఉద్యమంలో ఉద్యోగాలు ప్రధాన డిమాండ్‌గా తెలంగాణ కోసం కొట్లాడామని, చివరకు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో ఆ లక్ష్యం నెరవేరలేదని, అందుకే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడంతోపాటు.. ఉద్యోగాలకు అర్హులైన వాళ్లను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఆదివారం ప్రజాభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఎంపికైన 20 మంది అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఆర్థిక సాయంతో ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామన్నారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని, అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనేది తమ ఉద్దేశమన్న సీఎం.. అందుకే ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పుడు బీహారీ నుంచి అత్యధికంగా సివిల్స్ లో రాణిస్తున్నారని, అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలని, వారికి ఆర్థికంగా సహకారం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా లక్ష సాయం అందిస్తున్నామన్నారు. ఇది ఆర్ధిక సాయం కాదని, ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలన్నారు. కష్టంతో పాటు కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందన్నారు. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్ లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రేవంత్ చెప్పారు. 14 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని, కానీ తాము మాత్రం అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామన్నారు. మార్చి 31 లోగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తిచేయబోతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమే అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో అత్యధికంగా మన రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని.. రేవంత్‌రెడ్డి అన్నారు.