బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కవిత..బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల గురించి తీవ్రంగా స్పందించారు.
పింక్ బుక్ లో అన్ని రాసుకుంటున్నామని, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తామని కవిత స్పష్టం చేశారు. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు… మీ లెక్కలు తీస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
కవిత కామెంట్స్ ఆమె మాటల్లోనే…
సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు…. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001 లో ఆఘమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు. 95 శాతం పూర్తయిన సమ్మక్క సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అవకాశవాదం కోసం కడియం శ్రీ హరి పార్టీ మారారు .
కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు….పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. రూ 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది.
కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లు మాయమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. ఆడబిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థతి. రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.