ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభం అయింది. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం పది గంటల తర్వాత పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ఓటరును ఆకట్టుకునేందుకు ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలను ముస్తాబు చేసింది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
220 కంపెనీల పారా మిలిటరీ బలగాలు, 19 వేల మంది హోం గార్డులు, 35 వేల మంది ఢిల్లీ పోలీసులను పోలింగ్ భద్రత కోసం కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. 1.56 కోట్ల మంది ఓటర్లున్న హస్తినలో ఓటర్ల కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల సంఘం ఆయా ప్రాంతాల్లో అదనంగా బలగాలను మొహరించింది. ఈ దఫా డ్రోన్లతో పోలింగ్ పరిసరాలను పర్యవేక్షిస్తున్నారు.
ఢిల్లీలో మొత్తం 70 శాసనసభ స్థానాలు ఉండగా 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీటిలో 58 జనరల్ స్థానాలు కాగా 12 ఎస్.సీలకు రిజర్వు చేశారు. వరుసగా మూడోసారి ఢిల్లీలో తన సత్తా చాటాలని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చెమటోడ్చింది. మరోవైపు 25 ఏండ్ల తర్వాత ఢిల్లీ గద్దెనెక్కాలని భారతీయ జనతా పార్టీ పావులు కదిపింది. ఢిల్లీలో ఒక్కసారి అవకాశం ఇస్తే కమల కాంతులు విరబూయిస్తామని కమలనాథులు హామీలు ఇచ్చారు.
గత రెండు శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఈసారైనా తన ఉనికి చాటుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ నెల 8వ తేదీన వెలువడే ఫలితాల్లో ఢిల్లీ ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచుచూడాలి.