విజయవాడ వాసుల దీర్ఘకాల కల అయిన మెట్రో రైలు ప్రాజెక్టు అమలులో కీలకమైన ముందడుగు పడుతోంది. మెట్రో రైలుకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు భౌగోళిక పరిసరాల అధ్యయనాలు, స్థల పరిశీలనలు మొదలయ్యాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలు వేగం పెంచుకుంటున్న నేపథ్యంలో, దాని ప్రభావం విజయవాడపై పడే అవకాశముంది. ట్రాఫిక్ భారం పెరిగే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం ముందుగానే మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా భూసేకరణకు సంబంధించిన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
గన్నవరం, కేసరపల్లిలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, రెవెన్యూ అధికారులతో కలిసి విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ చీఫ్ మేనేజర్ జి.పి. రంగారావు పరిశీలన నిర్వహించారు. బస్టాండ్, హెచ్‌సీఎల్, కేసరపల్లి కూడలిలో 12.42 మీటర్ల వెడల్పుతో మెట్రో నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు అవసరమైన భూముల వివరాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
మెట్రో ప్రాజెక్టు తొలి దశలో రెండు కారిడార్లను నిర్మించనున్నారు. మొదటి కారిడార్ 26 కిలోమీటర్ల దూరం ఉండగా, ఇది పీఎన్బీఎస్ (పండిట్ నెహ్రూ బస్టాండ్) నుండి గన్నవరం వరకు సాగుతుంది. రెండో కారిడార్ 12.4 కిలోమీటర్ల మార్గం పీఎన్బీఎస్ నుండి పెనమలూరు వరకు ఉంటుంది. ఈ రెండు కారిడార్లు కలిపి మొత్తం 38.4 కిలోమీటర్ల దూరం కవర్ చేయనున్నారు. వీటిలో మొత్తం 34 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో మరో 27.75 కిలోమీటర్ల పొడవుతో మెట్రో విస్తరించనున్నారు. మొత్తంగా రెండు దశల్లో కలిపి 66.15 కిలోమీటర్ల నిడివితో మెట్రో నిర్మాణం జరగనుంది.
మొదటి దశకు రూ.11,009 కోట్ల ఖర్చు అంచనా వేశారు. ఇందులో రూ.1,152 కోట్లను భూసేకరణ కోసం కేటాయించారు. ఈ దశలో 91 ఎకరాల భూమి అవసరమవుతుందని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు.
ఈ 91 ఎకరాల్లో కృష్ణా జిల్లాలో 70.95 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 11.71 ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. రైల్వే శాఖకు చెందిన 1 ఎకరా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దాదాపు 5 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 75 ఎకరాలకు పైగా ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉంటుంది.
ఈ మెట్రో ప్రాజెక్ట్ పూర్తయితే విజయవాడ నగర రూపురేఖలు మారిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి డీపీఆర్‌ను ఆమోదింపజేసింది. ప్రస్తుతం భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
ఈ మెట్రో ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. హైవే మీదుగా నిర్మితమవుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూసేలా డబుల్ లేయర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రామవరప్పాడు వద్ద ఫ్లైఓవర్ మీద మరో ఫ్లైఓవర్ నిర్మించి, దాని మీద మెట్రో ట్రాక్‌ను నిర్మించనున్నారు.