- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
- తీవ్ర అనారోగ్యం పాలైన వంశీ
- రాజీకాయాలకు దూరంగా ఉండాలనే యోచనలో వంశీ
వైఎస్‌ఆర్‌సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఒకదాని వెనకాల ఒకటిగా ఆయనపై వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ లభిస్తే.. మరో కేసు నమోదు చేస్తున్నారు. దీనిలో కూడా బెయిల్ దొరికితే ఇంకో కేసులో పీటీ వారెంట్ తో వస్తున్నారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్ కి రిమాండ్ ఖైదీగానే వంద రోజులు గడిచిపోయింది. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వల్లభనేని వంశీ మోహన్ పరిస్థితిని తలచుకొని ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను తలచుకొని వంశీ తీవ్రంగా కలత చెందినట్లు సమాచారం. ముఖ్యంగా రాజకీయాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. బెయిల్ లభించిన వెంటనే ఈవిషయంపై ఆయన ఓ ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆ కామెంట్స్ పై పశ్చాత్తాపం..
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండు సార్లు గన్నవరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ నుంచే విజవాడ ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో అప్పటికి అయిదు సార్లు శాసనసభ్యునిగా గెలిచిన దాసరి బాలవర్ధనరావుని కాదని గన్నవరం టిక్కెట్ వల్లభనేని వంశీకి ఇచ్చారు చంద్రబాబు. ఆతరువాత 2019లో కూడా వంశీకే టిక్కెట్ ఇచ్చారు. ఈ రెండు సార్లు శాసనసభ్యునిగా గెలిచిన వంశీ 2019లో అధికార వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. అయితే వంశీ వైసీపీలో చేరడానికి ముందు నుంచే ఐటీడీపీ కార్యకర్తలు వల్లభనేని వంశీ వెంట పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో వైసీపీలో చేరిన తరువాత వంశీ కూడా చంద్రబాబు మీద ఆయన తనయుడు నారాలోకేష్ మీద తరచు విమర్శలు చేస్తూ ఉండేవారు. ఒక దశలో ఈ విమర్శలు శృతి మించుతూ ఉండేవి. వంశీ తనపైనా తన తల్లిదండ్రులపైనా చేసిన విమర్శలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేవారు. తాము అధికారంలోకి వచ్చాక వంశీని కడ్రాయర్ తో నడి రోడ్డు మీద నిలబెతానని బహిరంగ వేదికలపై శపథం చేసేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీపై అంతకన్నా ఎక్కువగా పగ తీర్చుకుంటున్నారు. దాదాపు రోజులుగా వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో మగ్గిపోతున్నారు. మానసికంగా అంతులేని వేదన అనుభవిస్తున్న వంశీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆయన ఆహార్యం కూడా దారుణంగా మరిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో న్యాయ సాహాయం అందడం లేదనే ఆవేదనతో వంశీ ఉన్నట్లు సమాచారం.
గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి, అక్కడ పనిచేస్తున్న సత్య వర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ వంటి కేసులు వల్లభనేని వంశీపై ఏపీ పోలీసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలోనే ఫిబ్రవరి 13న హైదరాబాదులో వల్లభనేని వంశీ మోహన్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి కేసు మీద కేసులు పెడుతూనే ఉన్నారు. మొత్తం ఆరు కేసులు పెట్టారు. అందులో ఐదు కేసుల్లో బెయిల్ లభించింది. అయితే ఇంతలో నకిలీ ఇళ్లపట్టాలకు సంబంధించి కేసు నమోదు చేశారు. దీంతో ఆయన రిమాండ్ మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో గన్నవరం నియోజకవర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దుట్టా రామచంద్ర రావు కుమార్తెకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వల్లభనేని వంశీ మోహన్ లో మరింత మనస్థాపం పెరిగినట్లు సమాచారం. ఇంత జరిగాక బెయిల్ పై విడుదలయ్యాక వల్లభనేని వంశీ ఊహగానాలు నిజం చేస్తూ రాజకీయాలకు దూరం అవుతారా లేక రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ రాజకీయాల్లో యాక్టీవ్ అవుతారో వేచి చూడాలి.