- షేక్ హాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన ఉజ్బెకిస్తాన్ ఆటగాడు
- ఆడవారితో చేతులు కలపబోనని వివరణ
- సంచలనంగా మారుతున్న వీడియో, ఎక్స్ ఖాతా వివరణ
- గతంలో భారతీయ క్రీడాకారిణితో షేక్ హాండ్
- అప్పుడూ తప్పే చేశానని వింత వివరణ
- తప్పు బడుతున్న క్రీడాభిమానులు
- క్రీడలకు మతం రంగు పులుముతారా?
విశ్వ వ్యాప్త క్రీడలకూ మతం రంగు పులుముకుంటోందా? నెదర్లాండ్స్ లోని విజ్కాన్జీలో జరుగుతున్న టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ లో భారతీయ గ్రాండ్ మాస్టర్ వైశాలిని ఆమె ప్రత్యర్ధి ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ నోడిర్బెక్ యాకుర్బేవ్ బహిరంగంగా అవమానించడం విమర్శల పాలవుతోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కొన్ని సెకన్ల వీడియో సంచలనం గా మారింది. అయితే తన చర్యకు ఆ ఛెస్ క్రీడాకారుడు తర్వాత ఎక్స్ వేదికగా క్షమాపణ చెప్పాడు. కానీ అందుకు తగిన వివరణ మాత్రం ఇవ్వలేకపోయాడు.
టోర్నమెంట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైశాలి నాల్గవ రౌండ్ ఛెస్ పోటీకి ముందు తన ప్రత్యర్ధి అయిన యాకుర్బేవ్ తో కరచాలనం చేసేందుకు చేయి ముందుకు ఇవ్వగా అతగాడు నిరాకరించి అవమాన పరిచాడు. ఈ వీడియోను ఛెస్ బేస్ ఇండియా వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
అది మా మతాచారం ప్రకారం నిషిద్ధం
2019 గ్రాండ్ మాస్టర్ అయిన యాకుర్బేవ్ తాజా ఛాలెంజర్స్ పోటీలో ఎనిమిది రౌండ్లలో ఓడిపోయి కేవలం మూడు పాయింట్లతో బరిలో నిలిచాడు. లీడ్ లో ఉన్న వైశాలి కరచాలనానికి చేయి ముందుకు చాపగా నిరాకరించిన దృశ్యం వైరల్ గా మారడంతో తన ఎక్స్ ఖాతాలో చివరకు వివరణ ఇచ్చాడు. తనకు ప్రత్యర్ధి వైశాలీ అన్నా, ఆమె సోదరుడు ప్రగ్నానంద అన్నా గౌరవమేనని కానీ మతపరమైన కారణాలతో తాను పరాయి మహిళల చేతులు తాకబోనని అందుకే షేక్ హాండ్ ఇవ్వలేదని రాసుకొచ్చాడు. తాను ముస్లిం మతాచారాలు మనసా, వాచా పాటిస్తానని, ఆ నిబంధనల ప్రకారం మహిళల చేతులు తాకడం నిషిద్ధమని, భారతీయ మహిళలంటే తనకు గౌరవమనీ చెప్పుకొచ్చాడు.
అప్పుడు చేసినదీ తప్పే
అయితే 2023లో దివ్య అనే భారతీయ గ్రాండ్ మాస్టర్ తో కరచాలనం చేసిన దృశ్యాలపై కూడా వివరణ ఇచ్చాడు. అప్పుడు కూడా తాను చేసింది తప్పేనన్నాడు యాకుర్బేవ్. తాను తనవరకూ నిబంధనలను పాటిస్తానని ఎదుటి వారు పాటించాలని తాను కోరుకోనని, ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం, బుర్ఖా పాటించడం లాంటివి వారి వ్యక్తిగతమని యాకుర్బేవ్ అన్నాడు.
తిప్పికొట్టిన వైశాలి
అయితే తొలి నాలుగు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న వైశాలి ఈఘటన తర్వాత యాకుర్బేవ్ కు షేక్ హాండ్ ఇవ్వలేదు. ఇప్పటికి 8 రౌండ్లు ముగిసాయి. ఇంకా ఐదు రౌండ్లు పూర్తయితేకానీ విన్నర్ ఎవరన్నది తెలీదు.
అయితే 8వ రౌండ్ లో తన ప్రత్యర్ధిగా రానున్నరొమేనియా యువతి ఇరినా బులమాగాకు ముందుగా తెలియ చేయడానికే తానీ పోస్ట్ పెడుతున్నట్లు యాకుర్బేవ్ స్పందించాడు. తాను టోర్నమెంట్ హాలులోకి ప్రవేశించాక రుమనియా యువతికి ముందే విషయం వివరించానని, అయినా నిర్వాహకులు కనీసం నమస్తే అయినా పెట్టాలని కోరారని, ఆ సంగతి దివ్య, వైశాలిల విషయంలో మర్చిపోయాననీ వివరణ ఇచ్చాడు. అయితే యాకుర్బేవ్ వివరణ క్రీడాభిమానులను సంతృప్తి పరచలేదు.