అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం పెరుగుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థల్లో సంపన్నుల జోక్యం ప్రమాదకరంగా మారుతోందన్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో జో బైడెన్ చివరి ప్రసంగం చేశారు.
దేశంలో సంపన్నమైన, శక్తివంతమైన, ప్రభావంతమైన వ్యక్తుల చేతుల్లో అధికారం ఉన్నదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతోందని, ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు భంగం కలుగుతోందని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, సోషల్ మీడియా దుష్ ప్రచారంపై వార్నింగ్ ఇచ్చారు.
తన పాలనలో సాధించిన ఘనతల గురించి ఆయన వివరించారు. ఉద్యోగాల కల్పన, మౌళిక సదుపాయాలపై ఖర్చు, ఆరోగ్య పరిరక్షణ, కోవిడ్ నుంచి బయటపడడం, మళ్లీ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో ఎలా నిలిపారన్న అంశాలను ఆయన తన ప్రసంగంలో వివరించారు. తన హయంలో జరిగిన పనులకు సంబంధించిన ఫలితాలు అందాలంటే ఇంకొంత సమయం పడుతుందన్నారు. మేం విత్తనాలు నాటామని… అవి పెరిగి కొన్ని దశాబ్ధాల పాటు ఆ పుష్పాలు వికసిస్తాయన్నారు.
అమెరికా ప్రజలపై సమాచార దాడి జరుగుతోందని, తప్పుడు సమాచారం ప్రచారం ఎక్కువగా ఉందని, దీంతో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. మెటా లాంటి సోషల్ మీడియా కంపెనీలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెకింగ్ జరగడం లేదన్నారు. అబద్ధాలతో నిజాన్ని కప్పిపుచ్చుతున్నారన్నారు.
దశాబ్ధాల రాజకీయ కెరీర్‌కు స్వస్తి పలుకుతూ.. బైడెన్ చేసిన ప్రసంగంపై మీడియాలో పలు రకాలుగా కథనాలు వెలువెడుతున్నాయి. 82 ఏళ్ల బైడెన్ శ్వేతసౌధం నుంచి చేసిన చివరి టీవీ ప్రసంగంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.