కొత్త ఏడాదిలో సరికొత్తగా దూసుకుపోతుంది స్టాక్ మార్కెట్. తొలిరోజులాగానే.. రెండో రోజు కూడా భారీ లాభాలను సాధించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1436 పాయింట్లు లాభపడి ఇంట్రాడేలో 80 వేల మార్క్‌ని తాకింది. అలాగే నిఫ్టీ 445.75 పాయింట్ల లాభంతో 24 వేల 188 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఈ లాభాలతో ఒక్కరోజులోనే 6 లక్షల కోట్ల వరకు ట్రేడర్ల సంపద పెరిగింది.
అయితే బుల్ ఇలా అన్‌స్టాపబుల్‌గా పరుగులు తీయడానికి అనేక కారణాల ఉన్నాయంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్. యూఎస్, యూరోపియన్ స్టాక్ ఫ్యూచర్స్ అమ్మకాలు పెరిగాయి. మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల క్షీణతను చవిచూసిన టెక్నాలజీ స్టాక్స్ లాభాలను చూశాయి. డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 7.3 శాతం పెరిగి లక్షా 77 వేల లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక మూడో క్వార్టర్‌లో ఆటోమోటివ్, ఫైనాన్షియల్స్ సహా కీలక రంగాల నుంచి అప్‌డేట్స్ అన్ని సానుకూలంగా ఉండటం కూడా బాగానే కలిసి వచ్చింది.
ఇక గురువారం మార్కెట్ ర్యాలీకి ఐటీ రంగం కూడా ఓ కారణమనే చెప్పాలి. ఈ రంగ ఇండెక్స్ ఒక శాతం పెరిగింది. నిఫ్టీ తన 200 రోజుల కదలిక సగటును అధిగమించింది. ఇది ఒక ముఖ్యమైన టెక్నికల్ ఐడెంటిటి అని చెప్పవచ్చు. ఇది స్టాక్ మార్కెట్ ర్యాలీకి బలం చేకూర్చింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ బలంగా పుంజుకోవడంతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది.