రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇంకా భూ మాఫియా ఆగడాలు తగ్గుముఖం పట్టడం లేదు. ప్రధానంగా పటాన్‌చెరు ప్రాంతంలో కోట్ల రూపాయల విలువ చేసే భూములను టార్గెట్ చేసుకొని మాఫియా ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇప్పటికే పొజిషన్‌లో ఉన్న వాళ్లను కూడా బెదిరిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. వందల మంది అనుచరులను వెంటేసుకొని తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు తాజాగా మరొకటి బయటపడింది. భూ మాఫియా అరాచకాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని డిఫెన్స్‌కాలనీలో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే భూమి కబ్జాకు ఓ మాఫియా ముఠా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దాదాపు వంద మంది అనుచరులతో ప్రైవేట్ స్థలంలోకి దౌర్జన్యంగా చొరబడ్డారు. గేట్లు విరగ్గొట్టి మరీ లోపలికి ప్రవేశించిన రౌడీలు.. ఆ స్థలంలో ఉన్న వాచ్‌మెన్ కుటుంబాలపై దాడికి పాల్పడ్డారు. వాచ్‌మెన్లు, వాళ్ల కుటుంబ
సభ్యులపైనా విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ హుకుం జారీచేశారు. ఆ స్థలం వదిలి వెళ్లకపోతే అంతు చూస్తామంటూ బెదిరించారు.
భూ మాఫియాకు చెందిన దుండగుల దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు.. ప్రైవేట్ స్థలంలో ఉన్న విలువైన సామాగ్రిని కూడా రౌడీలు ధ్వంసం చేశారు. అక్కడున్న సామాగ్రిపై పెట్రోల్ పోసి తగల బెట్టారు. అంతటితో ఆగకుండా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న సీసీకెమెరాలు కూడా పగులగొట్టారు దుండగులు.
అయితే, ఈ భూ మాఫియా గ్యాంగ్ సాగంచిన అరాచకాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ రౌడీ గ్యాంగ్ సీసీ కెమెరాలను ధ్వంసం చేయకముందు సాగించిన అరాచకాలు ఆ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే, ఈ భూ మాఫియా గ్యాంగ్ పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, అతని తమ్ముడి అనుచరులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ పలుకుబడితో దౌర్జన్యంగా కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కాజేసేందుకు ఈ రౌడీ గ్యాంగ్ ప్లాన్ వేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.