- విదేశీ సినిమాలపై 100 శాతం టాక్స్
- విదేశీ సినిమాలతో హాలీవుడ్ పరిశ్రమ నష్టపోతోంది
- ఇది అమెరికన్ జాతి భద్రతకే పెను ముప్పు
- అర్ధ సత్యాలతో హాలీవుడ్ ఇండస్ట్రీకి నష్టం
- సినిమాలన్నీ హాలీవుడ్ లోనే నిర్మించాలి
- ట్రంప్ టార్గెట్ ఎవరు అన్నదానిపై రాని స్పష్టత
- ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పై ట్రంప్ ఎఫెక్ట్
- బాలీవుడ్ సహా అన్ని భాషా చిత్రాలకు ఇది దెబ్బే
- టాలీవుడ్ కు గట్టిగా తాకనున్న ట్రంప్ ఎఫెక్ట్
- భారీ బడ్జెట్ మూవీలకు ఒవర్సీస్ కలెక్షన్లే కీలకం
- రెండు దశాబ్దాలుగా అనూహ్యంగా పెరిగిన ఓవర్సీస్ మార్కెట్
- ఓవర్సీస్ కాసుల వేటలో హీరోలు, నిర్మాతలు
- క్లబ్ మేనియాల జోరుతో విస్తరించిన ఫిలిం ఇండస్ట్రీ
- వెయ్యి కోట్ల క్లబ్ కి చేరుతున్న మన హీరోల సినిమాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సారి విదేశీ సినిమాలపై తన అక్కసు వెళ్లగక్కారు. ఇప్పటికే చైనాతో ట్రేడ్ వార్ ప్రకటించిన ట్రంప్ దానిపై టారిఫ్ ల మోత మోగించారు. ఇప్పుడు ఆయన దృష్టి విదేశీ సినిమాలపై పడింది. అమెరికాలో విదేశీ సినిమాల తాకిడి వల్ల అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చతికిలబడిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధించారు.
ఇతర దేశాలు సినీ నిర్మాతలకు, రకరకాల ప్రోత్సాహకాలు ప్రకటించి ప్రలోభాలు పెట్టి అమెరికా స్టూడియోలకు దూరంగా వారు వెళ్లిపోయేలా చేస్తున్నాయని ఆరోపించారు. తమ దేశంలో హాలీవుడ్ తో పాటు ఇతర సినీ విభాగాలన్నీ ఇలాంటి ప్రయత్నాల వల్ల నాశనం అవుతున్నాయని అన్నారు. ఇతర దేశాలు సంఘటితంగా చేస్తున్న ఈ దాడి అమెరికన్ జాతి భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే రకరకాల వార్తలు, ప్రచారాల వల్ల హాలీవుడ్ నష్టపోతోందని ట్రంప్ ఆరోపించారు.అందుకే తాను అమెరికా వాణిజ్య శాఖను ఆశాఖ కార్యదర్శి ని విదేశీ గడ్డపై నిర్మించిన సినిమాలకు వంద శాతం టారిఫ్ విధించమని ఆదేశించినట్లు తెలిపారు. ఇది దేశంలోకి ఎంటర్ అయ్యే ప్రతీ సినిమాకు వర్తిస్తుందన్నారు. తమదేశం మళ్లీ అమెరికాలోనే సినిమాల నిర్మాణం జరగాలని కోరుకుంటోందని ట్రంప్ అన్నారు. అయితే ఈ చర్య అమెరికన్ ప్రొడక్షన్ కంపెనీలను టార్గెట్ చేసి ఇచ్చిన ఉత్తర్వా లేక విదేశీ ప్రొడక్షన్ కంపెనీలదా? లేక విదేశాల్లో నిర్మించిన సినిమాలనుద్దేశించినదా అన్నది మాత్రం స్పష్టత లేదు.
అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న తరుణంలో నెల్లాళ్ల క్రితం అమెరికన్ సినిమాలను తమ దేశంలో అడుగు పెట్టడాన్ని దశల వారీగా తగ్గించేస్తామని ప్రకటించింది.చైనా చేసిన ఈ ప్రకటన తర్వాత నెల్లాళ్లకు ట్రంప్ ఈరకంగా స్పందించారు.
తమపై విచక్షణా రహితంగా ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల అమెరికాపై చైనీయులకు అసహనం పెరుగుతోందని అమెరికన్ సినిమాలకు ఆడియన్స్ కూడా తమ దేశంలో తగ్గుతున్నారని చైనా ప్రకటించింది.అధికారంలోకి రాగానే అన్ని దేశాల మీద టారిఫ్ లదాడి చేసిన ట్రంప్ ఆ తర్వాత చైనాకి తప్ప మిగిలిన దేశాలకు కొంత మినహాయింపు ప్రకటించారు.
మన సినిమాలపై ప్రభావం ఎంత?
ట్రంప్ టారిఫ్ ల ప్రభావం మన సినిమా ఇండస్ట్రీ పై కూడా భారీగా పడే అవకాశముంది. కారణం ఈమధ్య కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీయే విదేశాల్లో షూటింగ్ చేయడం ఆనవాయితీగా మారింది. పైగా మన నిర్మాతలు ఈమధ్య కాలంలో హీరో రేంజ్, రెమ్యునరేషన్, మూవీ కలెక్షన్లు, ఓవర్ సీస్ లో సక్సెస్ ని బట్టి బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు. గ్లోబలీకరణ బాగా పెరిగి భారతీయులు అన్ని దేశాలకూ విస్తరించడంవల్లా, అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ఉండటం వల్ల మన నిర్మాతలు ఓవర్సీస్ కలెక్షన్స్ ఆధారంగానే సినిమా నిర్మాణాలు ప్లాన్ చేస్తున్నారు. ఓ మాదిరి సినిమాలే ఈ రకంగా ఉంటే ఇక మహా మహా డైరక్టర్లు తీసే భారీ బడ్జెట్ మూవీస్ కి ఓవర్సీస్ కలెక్షన్లే కీలకం.మనకన్నా ముందే అక్కడ సినిమాలు రిలీజ్ అయ్యి మూవీ పల్స్ కూడా ముందే వచ్చేస్తున్న కాలమిది.పైగా మౌత్ పబ్లిసిటీ కూడా సినిమా సక్సెస్ పై ప్రభావం చూపిస్తోంది. ఓవర్సీస్ టాక్ కూడా కీలకమే కాబట్టి ఓవర్సీస్ ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా సినిమాలు తీస్తున్నారు. గతంలో ఉత్తర అమెరికా, యూఏఈ దేశాల్లో భారతీయ సినిమాలకు ఆదరణ ఉండగా ఇప్పుడు ఇది మరింత విస్తరించి యూకే తదితర దేశాలకు కూడా పాకింది. మన సినిమాలకు విదేశాల్లో మంచి కలెక్షన్లు, హిట్ టాక్ రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా విస్తరించింది. గతంలో అయితే ఓవర్సీస్ కలెక్షన్లు 75కోట్లు వస్తే అద్భుతం అనుకునేవారు.
క్లబ్ మేనియాల జోరు
కానీ ఆ తర్వాత వందలకోట్ల క్లబ్ మానియా మొదలైంది.ఇప్పుడు వంద కోట్ల క్లబ్ కు చేరడం చాలా చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు సినిమాల రేంజ్ 400నుంచి 500 కోట్ల క్లబ్ కి ఎగబాకింది. దంగల్ లాంటి హిట్ మూవీస్ ఓవర్సీస్ కలెక్షన్లు 1521 కోట్లుగా నమోదవడమే ఒక నిదర్శనం.. అలాగే బజరంగ్ భాయిజాన్, పఠాన్,జవాన్ లాంటి సినిమాలు నాలుగొందల క్లబ్ ను చేరాయి. అమెరికా,ఇతర దేశాలతో పాటు చైనాలో మన మూవీస్ మార్కెట్ బాగా విస్తరించింది.బాలీవుడ్ సినిమాలను అక్కడ జనం బాగా ఇష్టపడుతున్నారు. సూపర్ హిట్ అయిన పది బాలీవుడ్ బాక్సాఫీస్ హిట్లను పరిశీలిస్తే ఒక్క దంగల్ మాత్రమే వెయ్యికోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
బాలీవుడ్, టాలీవుడ్ పై ప్రభావం
తెలుగు సినిమాల ఓవర్సీస్ కలక్షన్లు ఓ రేంజ్లో సాగుతున్నాయి. సూపర్, డూపర్ హిట్ అయిన పుష్ప1, పుష్ప 2, బాహుబలి, ట్రిపుల్ఆర్, కల్కి2928ఏడీ, సలార్,కేజీఎఫ్ ఛాప్టర్ 2 లాంటి భారీ సినిమాల బడ్జెట్ ను ఓవర్సీస్ వసూళ్ల అంచనాలపైనే పెంచుతూ వచ్చారు. పుష్ప అమెరికాలో మొత్తంగా 14 మిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది.తెలుగులో హీరో అల్లూ అర్జున్, మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ లాంటి పేరున్న స్టార్ల సినిమాలకైతే ఓవర్సీస్ మార్కెట్ ఊహించనంతగా పెరిగిపోయింది.. అభిమాన సంఘాలు పెరిగాక అమెరికాలోని న్యూయార్క్ బిజీ సెంటర్ లోనూ తమ అభిమాని సినిమా వాల్ పోస్టర్లను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ప్రదర్శించి పండగ చేసుకుంటున్నారంటే ఓవర్సీస్ మార్కెట్ ప్రత్యేకించి అమెరికాలో మన సినిమాలకెంత బిజినెస్ ఉందో అర్ధమవుతోంది.ఇప్పుడు ట్రంప్ వంద శాతం టాక్స్ విధిస్తే మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పైనే గణనీయమైన ప్రభావం పడుతుంది. బాలీవుడ్, టాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్లు, హీరోలకు పెద్ద దెబ్బ పడుతుంది. ట్రంప్ టారిఫ్ దెబ్బ మన భారీ బడ్జెట్ మూవీల మేనియాను నేలకు దించుతుందా?