అమెరికా వచ్చే వారి సంగతి దెవుడెరుగు ఇప్పుడక్కడున్న వలసదారుల మెడపై కొత్తి వేలాడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ఒక్కో చర్యతో ఇప్పుడు అనేక రకాల వీసాలు తీసుకొని అక్కడ నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించి వారిని సొంత ఖర్చులతో విమానాల్లో ఆయా దేశాలకు తరలిస్తున్నారు ట్రంప్. ఓ వైపు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు హెచ్1బీ వీసాదారులపై ఫోకస్ చేశారు.
ఇప్పటివరకు వలసదారుల కట్టడికి తీసుకున్న చర్యలకు మించి సంచలనంగా మారనుంది ఈ చర్య. హెచ్1బీ ఆటోరెన్యూవల్ రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు అమెరికా వీసీ ఆటోరెన్యూవల్ రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇది ఇతర దేశాల వారితో పాటు భారతీయులకు పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. దీని వల్ల హెచ్1బీ, ఎల్1 వీసాదారులకు కష్టాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. హెచ్1బీ ఆటోరెన్యూవల్‌తో ఇప్పటివరకు భారతీయులు అధిక శాతం లబ్దిపొందతున్నారు.
హెచ్-1బీ, ఎల్-1 వీసాల గడువును పొడిగింపును పెంచుతూ బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకొంది. గతంలో ఇది కేవలం 180 రోజులు ఉండగా.. గత సర్కారు 540 రోజులకు పెంచింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కఠిన వలసల నియంత్రణ, కఠిన వీసా రూల్స్‌కు ఇది అడ్డంకిగా మారుతుందని సెనెటర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇద్దరు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. వర్క్ వీసాలకు ఆటోరెన్యూవల్ అనేది ఇమ్మిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమైందన్నారు. ఈ తీర్మానంపై ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.