25.1 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

ఆక్వా చెరువులకు గడ్డుకాలం

ఒకప్పుడు ఆహ్లాదకరమైన సువిశాల సాగర తీరం ఉండేది. సునామీ, తుపాన్లు వంటి విపత్తుల నుంచి కాపాడేలా ఇసుక తెన్నెలు పుష్కలంగా కనపడేవి. ఇప్పుడు కనుచూపు మేరలో చెరువులే కనిపిస్తున్నాయి. తీరం వెంబడి పచ్చని గోడలా సరుగుడు తోటలతో గ్రీన్‌ బెల్ట్‌ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఆక్వా కాలుష్యంతో నిండిపోయింది. ఏకంగా సముద్రానికి ఆనుకుని మరీ చెరువులు తవ్వేయడం ఆందోళనకరంగా మారింది. ఈ అక్రమ కార్యకలాపాల వల్లనే సముద్రం కోతకు గురి అవుతోంది. సీఆర్‌జడ్‌ పరిధి నానాటికీ ముందుకు చొచ్చుకు వచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది. విచిత్రమేంటంటే సీఆర్‌జడ్‌ పరిధిలోకి వచ్చే ఈ ఆక్వా చెరువులకు ఎటువంటి అనుమతులు లేవు. అయినా ప్రభుత్వం అందించే సబ్సిడీ విద్యుత్తు సరఫరా పుష్కలంగా లభిస్తోంది.

ఆక్వా చెరువుల దందాపై కొందరు జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో గ్రీన్‌ ట్రైబ్యునల్‌ సభ్యులు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల పరిధిలోని అంతర్వేదిలో పర్యటించారు. స్వయంగా అక్కడ జరిగే అక్రమాలను సభ్యులు పరిశీలించారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తీరం వెంబడి అక్రమంగా తవ్వేసిన ఆక్వా చెరువులను ధ్వంసం చేసి పూడ్చాలని ఆదేశించారు. లేకుంటే స్థానిక అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. స్పందించిన జిల్లా యంత్రాంగం ఆదిశగా చర్యలకు ఉపక్రమించింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అంతర్వేది నుంచి తుని మండలం అద్దరిపేట వరకు సముద్ర తీరం విస్తరించి ఉంది. ఇందులో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా విస్తరించి ఉన్న సముద్రతీరం వెంబడి విచ్చలవిడిగా చెరువులు తవ్వకాలు చేసి ఆక్వాసాగు చేస్తున్నారు. ప్రధానంగా అంతర్వేది గ్రామ పరిధిలో తీరప్రాంతం మొత్తం ఆక్వాసాగుగా మారిపోయింది. ఈ చర్యల వల్ల భారీగా తీరం కోతకు గురవుతోంది. ఈ అక్రమ ఆక్వా చెరువులపై జిల్లా అధికారులకు ఎన్నోసార్లు ప్రజలు ఫిర్యాదు చేశారు. చెరువులు ధ్వంసం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయోజం లేకపోవడంతో రాజోలు ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ యనుమల రాజా గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఆదేశాలు జారీ చేసింది.

జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. అంతర్వేది సముద్ర తీరం మొత్తం ఆక్వాపరం కావడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు తాజాగా జిల్లా కలెక్టరు, ఎస్పీలకు 434 ఆక్వాచెరువులను ధ్వంసం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. కొందరు అడ్డుకోవడంతో అధికారులు పోలీసు బందోబస్తుతో చెరువులు ధ్వంసం చేస్తున్నారు. అంతర్వేది సముద్రతీర ప్రాంతంలోనే కాకుండా అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని తీరం వెంబడి ఉన్న ఆక్వాచెరువులు ధ్వసం చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది. కోనసీమవ్యాప్తంగా సఖినేటిపల్లితోపాటు మలికిపురం, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల పరిధిలో తీరానికి ఆనుకుని ఉన్న అక్రమ ఆక్వాచెరువులు ధ్వంసం చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com