- పదికోట్ల మంది తరలి వస్తారని అంచనా
- ట్రాఫిక్ జామ్ తో కోర్టులు, స్కూళ్లకు శెలవులు..
- ప్రయాగ్ రాజ్ అంతటా ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు
- అయోధ్యకు ఒక్కసారిగా పెరిగిన భక్తుల తాకిడి.
- స్థానికులను దర్శనాలకు రావొద్దన్న ఆలయాధికారులు
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతోంది. ప్రపంచం నలుమూలలనుంచి హిందూ ఆధ్యాత్మిక వాదులు ఈ పుణ్యస్థలికి పోటెత్తుతున్నారు. బుధవారం (ఇవాళ) మౌని అమావాస్య సందర్భంగా భారీ సంఖ్యలో జనం పవిత్ర స్నానాలకు వస్తారని యూపీ ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈ ఒక్క రోజులోనే కనీసం పదికోట్ల మంది తరలి వస్తారని అంచనా. ఆది, సోమవారాల్లో కలుపుకుని మూడు కోట్ల 29 లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారు. మౌనీఅమావాస్య రద్దీని తట్టుకోడానికి ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైనీ జంక్షన్, చియోకీ, సుబేదార్ గంజ్ స్టేషన్లో ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను నెలకొల్పారు. ప్రయాణికుల కదలికలను స్ట్రీమ్ లైన్ చేయడానికి కలర్ కోడెడ్ షెల్టర్లను అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఖుస్రో బాగ్ ఏరియాలో లక్షమందికి వసతి సౌకర్యాలను సిద్ధం చేశారు. రైల్వే అధికారులు రిజర్వుడు, అన్ రిజర్వుడ్ టిక్కెట్ కౌంటర్లు, ఏటీమ్ సెంటర్లు, మొబైల్ టికెటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వచ్చినవారు ప్రశాంతంగా దర్శనాలు, స్నానాలు చేసుకుని సౌకర్యవంతంగా వెనుదిరిగేలా యూపీ ప్రభుత్వం శ్రమిస్తోంది.
పుణ్యదినాలు.. పవిత్ర స్నానాలు
ఇవాళ అమావాస్య సందర్భంగా రెండో షాహీస్నాన్ చేస్తారు. ఇది కాక ఇంకో మూడు పర్వదినాలు ఉన్నాయి. ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణిమ, 26న శివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర స్నానాలకు జనం పోటెత్తనున్నారు. శివరాత్రి రోజన కుంభమేళా ముగింపు రోజు కూడా కావడంతో ఆరోజు మరింత రద్దీ ఉండే అవకాశాలున్నాయి.
ట్రక్కులు, ట్రాక్టర్లు, ట్రాలీలలో ప్రయాణం
దేశం నలుమూలల నుంచి అందుబాటులో ఉన్న వాహనాలతో బయల్దేరి ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్న భక్తులు అక్కడ సౌకర్యాల గురించి అసలు బెంగ పడటం లేదు.తమ ట్రక్కులు, ట్రాలీలనే మేక్ షిఫ్ట్ క్యాంపుల్లా మార్చేసుకుంటున్నారు. కుంభమేళా యాత్ర అనగానే చాలామంది బ్లాంకెట్లు, వండుకోడానికి తగిన రేషన్, వెంట తెచ్చుకుంటున్నారు. రోడ్ల పక్కనే విశ్రమిస్తున్నారు. పవిత్రస్నానం, పితృ తర్పణాలు, ఆలయ సందర్శనాలు తర్వాత ఆ చుట్టు పక్కలున్న కాశీ, వారణాసి, మధుర, అయోధ్యలను కూడా సందర్శించాకే వెనక్కి మళ్లుతున్నారు. యూపీ ప్రభుత్వం విస్తారమైన ఏర్పాట్లు చేసినప్పటికీ క్షణ క్షణానికి పోటెత్తుతున్న భక్తులకు ఆ ఏర్పాట్లు చాలటం లేదు. ట్రాఫిక్ జామ్ లు, రోడ్ల రద్దీ కారణంగా అలహాబాద్ హైకోర్టు ఈ నెలాఖరు వరకూ మూసేశారు. అలాగే వారణాసిలో స్కూళ్లలో టెంత్ క్లాస్ విద్యార్ధులకు ఇళ్ల దగ్గరే ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నారు. ఫిబ్రవరి 5 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాగ్ రాజ్ లో పవిత్ర స్నానాలు చేస్తున్న వారు పనిలో పనిగా వారణాసి, అయోధ్య, కాశీ ట్రిప్పులకు కూడా వెళుతున్నారు.
అయోధ్యకు పెరిగిన రష్
కుంభమేళాకు వచ్చేవారు పనిలో పనిగా అయోధ్య బాల రాముని దర్శనం కూడా చేసుకుంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడిని తట్టుకోవడం నిర్వా హకులకు కష్టంగా మారింది.ఈ నేపధ్యంలో అయోధ్యలో రాముని దర్శనం కోసం స్థానికులు కొన్నాళ్ల పాటు రావోద్దని, రష్ తగ్గాక రావచ్చనీ తెలిపారు.
ప్రయాగ్ రాజ్ స్పెషల్ రైళ్లపై రాళ్ల దాడి
మధ్యప్రదేశ్ నుంచి మహాకుంభమళాకు వెళ్లే స్పెషల్ ట్రైన్స్ కిక్కిరిసిపోతున్నాయి. అప్పటికే నిండిపోయి ఉన్న రైళ్లలో ఎక్కేందుకు స్టేషన్లలో భక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. రద్దీని తట్టుకోలేని రైలులోని ప్రయాణికులు బోగీ తలుపులు తెరవకుండా గడియ వేసేశారు. దాంతో ఆగ్రహించిన భక్తులు రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
కుంభమేళాలో అరుణ్ గోవిల్
మీరట్ బీజేపి ఎంపీ, రామాయణం టీవీ సీరియల్‌లో రాముని పాత్ర ధారి అయిన అరుణ్ గోవిల్ కుంభమేళాలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. పవిత్ర స్నానం, ఆలయాల దర్శనం పూర్తయిందని ఇతర భక్తులకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నామని ఆయన అన్నారు.