- ఇమ్మిగ్రంట్లపై ట్రంప్ కొత్త అస్త్రం
- సిటిజన్ షిప్ కావాలంటే ది అమెరికన్ షోలో పాల్గొనాలి
- బిగ్ బాస్ తరహా కాన్సెప్ట్ లో ప్రోగ్రాం
- పార్టిసిపెంట్స్ రైలులో అమెరికా అంతా తిరగాలి
- ఎల్లిస్ ఐలాండ్ నుంచి ప్రయాణం స్టార్ట్
- దేశమంతా తిరుగుతూ టాస్కులు చేయాలి
- అమెరికా సంస్కృతి, సంప్రదాయాలపై టాస్క్ లు
- అందులో గెలిచిన వాడే విజేత
- విజేతకు సిటిజన్ షిప్ ప్రదానం
- కేపిటల్ భవనం మెట్లపై ఓ నేత సమక్షంలో ప్రమాణం
- ఈ ఐడియాపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
- పరమ చెత్త ఐడియా అంటున్న యూజర్లు
ఇమ్మిగ్రంట్లపై రకరకాల అస్త్ర, శస్త్రాలు ప్రయోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా సిటిజన్ షిప్ సాధించడానికి మరో మెలిక పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో సిటిజన్ షిప్ పొందాలంటే ఒక రియాల్టీ టీవీ షోలో పాల్గొని విజేతగా నిలవాలన్నది ఆ కొత్త ఆలోచన. ఆ ప్రోగ్రాం పేరు ది అమెరికన్.
ఇది మన ఇండియన్ టీవీ బిగ్ బాస్ షోలా ఉంటుంది. వేర్వేరు దేశాలకు చెందిన ఇమ్మిగ్రంట్లు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. అందులో వారంతా రకరకాల టాస్క్ లు చేయాల్సి ఉంటుంది. అమెరికా సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తికి సంబంధించిన ఆ టాస్కుల్లో ఫైనల్ విజేతకు సిటిజన్ షిప్ ఇస్తారు. ఈ ఐడియా అమలు జరపడం గురించి అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ ఆలోచిస్తోంది.రచయిత, టీవీ షో ప్రొడ్యూసర్ రాబ్ వార్సాఫ్ దీని సృష్టి కర్త. ఇందులో ఆసక్తి గొలిపే అంశమేమంటే ఆ రచయిత కెనడా ఇమ్మిగ్రెంట్ కావడం. సిటిజన్ షిప్ ప్రక్రియ పూర్తి చేస్తున్న తరుణంలో ఆయనకు ఈ ఐడియా వచ్చింది.
బిగ్ బాస్ తరహా షో..
అమెరికన్ ట్రైన్ కాన్సెప్ట్ తరహాలో ఈ ప్రతిపాదిత షో ఉండబోతోంది. మొత్తం 12 మంది ఇమ్మిగ్రంట్లు ఈ షోలో పాల్గొంటారు.దీనితో పాటు వారు అమెరికా మొత్తం ప్రయాణిస్తూ ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయలకు సంబంధించిన టాస్క్ లు పూర్తి చేస్తుంటారు.ఈ షోని న్యూ యార్క్ లో ఎల్లిస్ ఐలాండ్ నుంచి మొదలు పెడతారు. ఇందులో ప్రతీ ఎపిసోడ్ లోనూ రకరకాల సిగ్మెంట్లు ఉంటాయి. హెరిటేజ్ ఛాలెంజ్,ఎలిమినేషన్ ఛాలెంజ్, టౌన్ హాల్ మీటింగ్, ఫైనల్ ఓట్ అనే సిగ్మెంట్లు ఉంటాయి.
అమెరికా సంస్కృతి, చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు కూడా షోలో ఉంటాయి. ఈషోలో టాస్కులు గెలిచి చివరికి విజేతగా నిలిచిన వ్యక్తి చేత ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు లేదా జడ్జి సమక్షంలో వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ భవనం మెట్లపై నిలిపి ప్రమాణం చేయిస్తారు.
అయితే ఈ షో పట్ల సోషల్ మీడియాలో పెద్ద రచ్చ రాజుకుంది. ఈ షోని హంగర్ గేమ్స్ లేదా 1987 నాటి ది రన్నింగ్ మ్యాన్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. నెటిజన్లు, యూజర్లు ఈ షో ఇమ్మిగ్రంట్ల పరువు తీసేదిగా ఉందని పౌరసత్వం అనే సీరియస్ ప్రక్రియను వినోదంగా మార్చేస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు.