- భయపెడుతున్న జీబీఎస్ సిండ్రోమ్
- దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
- తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి
- ఏపీలో 17 కేసులు వెలుగులోకి ఇద్దరి మరణం..
- రోగ నిరోధక వ్యవస్థపై అదే వ్యవస్థ దాడి
- ఓ రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్
- కాళ్లు, చేతులు చచ్చుబడి, ఆపై పోయే ప్రాణం
- ఆరంభ దశలో వస్తే ట్రీట్ మెంట్ సులభం
- రోజుకు ఐదు ఇంజక్ష్లు, ఐదు రోజుల ట్రీట్ మెంట్
- ఒక్కో ఇంజక్షన్ రూ.20 వేలు
- కలుషిత నీరు, ఆహారం, ఉడకని పదార్ధాలతో ప్రమాదం
గులియన్ బారీ సిండ్రోమ్.. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది.దేశంలోఈవ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూ వస్తుంటే అది చివరకు మన తెలుగు రాష్ట్రాల్లోనూ కాలు మోపిందన్న వార్తలు కలవరపెడుతున్నాయి.ముఖ్యంగా ఏపీలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోందన్న వార్తలతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తూ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి దానిని నిర్వీర్యం చేసే ఈ వ్యాధి గురించి ప్రతీ ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండటం అత్యవసరం.
లక్షణాలు ఎలా ఉంటాయంటే…
దీని ప్రాధమిక లక్షణాలు ఎలా ఉంటాయంటే దీని బారిన పడిన వారికి విపరీతమైన నిస్సత్తువ ఆవరిస్తుంది.కండరాల బలహీనత ప్రబలుతుంది.శరీరంలో రెండు వైపులకూ ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.మొదట కండరాల బలహీనతలా అనిపించినా ఆ తర్వాత వెన్ను నొప్పి, నొప్పిల్లో రకరకాల తేడాలు ఉండోచ్చు.మొదట పాదాలు,చేతుల్లో వ్యాపించే ఈ వ్యాధి ఆ భాగాలు చచ్చుబడిపోయిన తర్వాత శరీరం అంతా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు పక్ష వాతానికి కూడా దారి తీయవచ్చు. లక్షణాలు మొదట చిన్నగా ప్రారంభమై ఆ తర్వాత పెరుగుతూ పోతాయి. ఒక్కోసారి ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారి ప్రాణాలనే హరించేస్తుంది ఈ వ్యాధి సోకిన వారిలో కనీసం 15 శాతం వెంటిలేటర్ పై కూడా ఉండాల్సి వస్తుంది.ఈ వ్యాధి బారినపడిన వారిలో హృదయ స్పందనలు,రక్తపోటులోనూ అసాధారణమైన మార్పులు కనిపిస్తాయి.పైకి ప్రస్ఫుటంగా తెలియకపోయినా ఈ వ్యాధిలో అంతర్గతంగా ఇమ్యూనిటీ డిజార్డర్ లక్షణాలు కనిపిస్తాయి.
ఆరోగ్యకర కణజాలంపై స్వీయ రక్షణ వ్యవస్థ దాడి
జీబీఎస్ సిండ్రోమ్ బారిన పడిన వారి ఇమ్యూనిటీ దెబ్బతింటుంది.క్రమేపీ నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపి వారి మైలిన్ ఇన్సులేషన్ ను దె్బ్బ తీస్తుంది.దీనిని తీవ్రమైన పాలీ న్యూరోపతి గా పరిగణిస్తారు. ఈ వ్యాధి తీవ్రమైన వారికి ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలిన్ మందును ఇంజెక్ట్ చేయడం ద్వారా ట్రీట్ మెంట్ చేస్తారు.దీనివల్ల కోలుకోవడం కాస్త సులభమవుతుంది.కోలుకోడానికి సాధారణంగా వారాల నుంచి సంవత్సరాలు పట్టే అవకాశముంది.కొందరిలో ప్రాణాంతకం అయి చివరకు ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ వ్యాధి ఎందుకొస్తుందన్న దానిపై ఇప్పటి దాకా స్పష్టమైన వివరణ లేదు కానీ వైరస్ లేదా బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ సోకిన తర్వాత ప్రారంభమవుతుంది.మొదట కాళ్లలో జెర్క్ మొదలైనట్లు అనిపించడం, ఆతర్వాత అది క్రమేపీ పైకి వ్యాపిస్తూ చివరకు పక్షవాతానికి దారి తీస్తుంది.జీబీఎస్ సిండ్రోమ్ ఉన్నవాళ్లకి ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకోవడం కాదు ఆస్పత్రిలో చేరటమే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.
పుణేలో 11 మంది మృతి
మహారాష్ట్ర పుణే పరిసరాల్లో ఈ వ్యాధిసోకి ఇప్పటి వరకూ 11 మంది చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ వ్యాధిబారినపడి మరణించిన వారి సంఖ్య 21కి చేరుకుంది. కలుషిత నీరే కారణమని భావిస్తున్న అధికార యంత్రాంగం పుణే పరిసరాల్లో ఆర్వో ప్లాంట్లను, మినరల్ వాటర్ ప్లాంట్లను మూసివేయించారు.కర్ణాటక, ఏపీ,తమిళనాడు, పశ్చిమ బెంగాల్,అసోంలలోనూ ఈ వ్యాధిబారిన పడి ఒక్కొక్కరు మరణించారు.
ఏపీలో పెరుగుతున్న కేసులు…
ఏపీలో ఈ సిండ్రోమ్ కేసులు రోజు రోజుకూ కలవరపెడుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు తాగడం వల్ల ఇది వ్యాపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధిబారిన ఇప్పటి వరకూ 17 మంది పడినట్లు అధికారిక లెక్కలుచెబుతున్నాయి. వీరిలో ఓ మహిళ చనిపోయింది. గతేడాది ఇదే వ్యాధి 301 మందిలో కనిపించింది. ఎక్కువ కేసులు గుంటూరులోనే నమోదవుతున్నాయి.అయితే ఇది మహమ్మారి కాదు. అంటువ్యాధి కాదు అని తేల్చి చెప్పారు వైద్యులు. మన దేశంలో తొలిసారిగా పుణేలో ఈ కేసు నమోదైంది.ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక యాంటీ బాడీస్ తిరిగి బాడీపై పని చేస్తాయి.సాధారణంగా లక్షలో ఒకరికి సోకే వ్యాధి ఇది..చాలా అరుదుగా భావించే ఈ వ్యాధి ఇప్పుడు ఎక్కువవడం పట్ల వైద్యులు కూడా అప్రమత్తమవుతున్నారు. వాటి లక్షణాలను అధ్యయనం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
జీబీఎస్ కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి వ్యాధిసోకిన వారు వారి శరీర బరువును బట్టి రోజుకు ఐదు ఇమినో గ్లోబిన్ ఇంజక్షన్లు తీసుకోవాల్సిఉంటుంది. ఇలా ఐదు రోజుల పాటూ తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.20 వేలు ఖరీదు ఉంటుంది. అంటే ఐదు డోసులకు కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ ఇంజక్షన్లు కూడా ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేకపోవడం పట్ల విమర్శలు రేగుతున్నాయి.ఏపీలో ప్రస్తుతం ఈ ఇంజెక్షన్లు 1200 అందుబాటలో ఉన్నాయని, మరో ఆరువేల ఇంజక్షన్లు ప్రొడక్షన్ స్టేజీలో ఉన్నాయని, అవికూడా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
వ్యాధి బారినుంచి ఇలా కాపాడుకోవాలి…
-జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు కారే వ్యక్తులకు దూరంగా ఉండాలి
-బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఫేస్ మాస్క్ ధరించాలి
-తరచుగా చేతులు శుభ్రపరచుకుంటూ ఉండాలి
-చేతులతో కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు
– డాక్టర్ సలహాతో ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
గాస్ట్రో ఇంటస్టెనల్ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా జాగ్రత్త పడాలి
-సలాడ్లు, ఉడకని పచ్చి కూరగాయలు తినకూడదు
-సరిగా వండని, పచ్చి మాంసం, చికెన్, కోడిగుడ్లు తినరాదు
-పాశ్చరైజ్డ్ పాలు బాగా కాచినవి మాత్రమే తాగాలి
-రక్షిత మంచినీరే తాగాలి.. (కాచి చల్లార్చిన నీరు)
ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరికైనా కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం, విపరీతమైన నీరసం వెంటాడుతుంటే వెంటనే సమీపంలోని న్యూరాలజిస్టును కలసి వెంటనే చికిత్స పొందాలి. అప్పుడే ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోగలం.