38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

మంత్రి పదవి లేనట్టేనా?

జనసేన కీలక నేత, మెగా కుటుంబానికి చెందిన నాగబాబుకు మంత్రి పదవి దక్కడం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎన్నికల సమయంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమనే సంకేతాలు వచ్చినా, ఇప్పటికీ ఆ విషయంలో స్పష్టత లేదు. దీంతో, ఆయనకు అసలు మంత్రి పదవి వస్తుందా? రాదా? అన్న సందేహాలు జనసేన శ్రేణుల్లోనే కాక, రాజకీయ వర్గాల్లోనూ జోరుగా వినిపిస్తున్నాయి.

నాగబాబు జనసేన పార్టీ కోసం తెర వెనుక చాలా కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నాగబాబుకు మంత్రి పదవి వస్తుందని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవికోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. పార్టీ కోసం కష్టపడినవారికి పదవులు ఇవ్వడం తప్పు కాదంటూ పవన్ కల్యాణ్‌ పలుసందర్భాల్లో ప్రస్తావించారు. అందుకే ఉగాది నాటికే నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ భావించారు.

అయితే, ఉగాది దాటిపోయింది. కానీ, మంత్రి పదవి గురించిన చర్చలే వినిపించడం లేదు. దీనికి కొన్ని వ్యక్తిగత, రాజకీయ కారణాలున్నాయనే ప్రచారం ఉంది. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురవ్వడం, ఆ తర్వాత పవన్ ఆరోగ్య సమస్యలు – ముఖ్యంగా వెన్నునొప్పితో బాధపడటం వల్ల రాజకీయ అంశాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారని చెబుతున్నారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లారు. చంద్రబాబు తన 75వ పుట్టినరోజును కుటుంబంతో కలిసి విదేశాల్లో జరుపుకుంటున్నారు. ఆ తర్వాత మే 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. ఈ నేపథ్యంలో మే తొలి వారం వరకూ పెద్ద మార్పులు జరిగే సూచనలు కనిపించడం లేదు.

ఇక పిఠాపురం రాజకీయాలు గమనిస్తే, అక్కడ పరిస్థితులు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాగబాబును మంత్రి చేయడం వల్ల ఆ నియోజకవర్గంలో రాజకీయంగా మరింత ఒత్తిడికి లోనవుతారన్న ఆందోళనలో ఉన్నారని తెలిసింది. మంత్రి కాకుండా ఎమ్మెల్సీగా కొనసాగుతూ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడమే ఈ దశలో మంచిదని పవన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో పాటు, కుటుంబంలో ఇద్దరు మంత్రులుగా ఉండడం వల్ల పార్టీ పరంగా వచ్చే నెగటివ్ ప్రచారాన్ని కూడా పవన్ తప్పించాలనుకుంటున్నారని విశ్లేషకుల అభిప్రాయం. అందుకే చంద్రబాబుతో కలసి గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని తక్షణమే ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం పవన్ వాడుకోలేకపోయారు.

ఇక ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణపై కూడా చంద్రబాబుకు స్పష్టత లేనట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి కొత్త రాజకీయ అనుమానాలకు తావు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాలు వాయిదా పడుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవి వస్తుందనే అంచనాలు మెల్లమెల్గా వెనక్కి తగ్గుతున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com