24.9 C
Hyderabad
Wednesday, August 26, 2026

Live Video

spot_img

ఫుల్లుగా తాగి తూగిన తెలుగు రాష్ట్రాల ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఎంతగా మజా ఇచ్చిందో తెలియదు గానీ, కిక్కు మాత్రం భలే ఇచ్చింది. సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యం అమ్మకాలు భారీగి పెరిగాయి. డిసెంబర్‌ 31వ తేదీ అర్థరాత్రి దాకా మద్యం షాపులు, బార్లకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడంతో లిక్కర్‌ సేల్స్‌ దూసుకుపోయాయి. ఇటు, తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మద్యం ప్రియులు తమ సత్తా చూపించారు. మద్యం సీసాలన్నీ ఖాళీ చేసేశారు. ప్రభుత్వ ఖజానాలు నింపేశారు.

పాత ఏడాదికి బైబై చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే డిసెంబర్‌ 31 వతేదీ తెలుగు రాష్ట్రాలు కిక్కులో మునిగిపోయాయి. ఆ ఒక్కరోజే దాదాపు 403 కోట్ల రూపాయల విలువైన మద్యం లాగించేశారు. కొత్త ఏడాది పుణ్యమాని తెలంగాణలో మద్యం ఏరులై పారింది. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. ఎక్సైజ్‌శాఖ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం ఒక్కరోజులోనే సుమారు రూ.403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గడిచిన 5 రోజుల్లోనే డిస్టిల్లరీ కేంద్రాల నుంచి మద్యం షాపులకు కోట్ల రూపాయల విలువైన మద్యం చేరుకుంది. ప్రతి రోజు సగటున మద్యం గోడౌన్ల నుంచి 200 కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఆ మద్యం స్టాక్‌ మొత్తం అమ్ముడయ్యింది. ఇక, డిసెంబర్‌ 28 నుంచి జనవరి 1 వ తేదీ ఉదయం వరకు కేవలం 5 రోజుల్లోనే దాదాపు రూ.1,800 కోట్ల విలువైన మద్యం మందుబాబులు తాగేసినట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంతో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని చెబుతున్నాయి.

ఏడాది చివరి రెండు రోజుల్లో తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల్లోని దాదాపు ప్రతి గల్లీలో మద్యం ఏరులై పారింది. ఇక జనవరి 1వ తేదీన కూడా సెలవు కావడంతో.. బుధవారం కూడా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్‌ 30వ తేదీ ఒక్కరోజే మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం అక్షరాలా రూ.402.62 కోట్లు అని అధికారులు నిర్ధారించారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా 3,82,265 లికర్‌ కేసులు, 3,96, 114 బీర్‌ కేసుల అమ్మకాలు జరిగాయి. లిక్కర్‌ కంటే బీర్లే అత్యధికంగా అమ్ముడుపోయాయని చెబుతున్నారు. ఇక డిసెంబర్ 31 రాత్రి మద్యం కొనుగోళ్లు మరింత జోరుగా సాగాయి.

ఒక్క డిసెంబర్‌‌‌‌ నెలలోనే రూ.3,805 కోట్ల విలువైన 38.07 లక్షల లిక్కర్‌‌‌‌ కేసులు, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్టు ఎక్సైజ్​ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు జనవరి నుంచి డిసెంబర్‌‌‌‌ వరకు తీసుకుంటే ఏకంగా రూ.37,682 కోట్ల విలువైన 3.76 కోట్ల లిక్కర్‌‌‌‌ కేసులు, 5.47 కోట్ల కేసుల బీర్లు సేల్​ అయ్యాయి.రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్‌‌.. 3 సెలవు రోజులు మినహా మిగిలిన 7 రోజులు డిపోల నుంచి కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. నిరుడు డిసెంబర్ 22వ తేదీ నుంచి 31 వరకు జరిగిన అమ్మకాలు రూ.1,510 కోట్లని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా దాదాపు 200 కోట్ల ఆదాయం అదనంగా సమకూరిందని అధికారులు తెలిపారు.

ఇక, న్యూఇయర్‌ వేడుకలంటేనే ఈవెంట్లు. ఆట పాటలతో పాటు మద్యంతో ఎంజాయ్‌ చేయడమని అందరికీ తెలిసిందే. షరా మామూలుగానే ఎక్సైజ్​ శాఖ డిసెంబర్​ 31న ప్రత్యేక ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. దీంతో రూ. 56.48 లక్షల రాబడి వచ్చింది. మొత్తం 287 ఈవెంట్స్ కు ఎక్సైజ్ శాఖ పర్మిషన్​ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 243 అనుమతులు ఇవ్వగా.. మిగిలిన జిల్లాల్లో 44 పర్మిషన్స్​ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్​ వేడుకల్లో భాగంగా జరిగిన సంబురాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఎక్సైజ్ శాఖ 40 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగిన దాడుల్లో 4 కేసులు నమోదు చేశారు. 2 చోట్ల గంజాయి పట్టుకోవడంతోపాటు ఒక పబ్బు పరిసర ప్రాంతాల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఎక్సైజ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తో పాటు 17 మంది అధికారులు పర్యవేక్షించారు. రెండు చోట్ల 313 గ్రాములు, 3.313 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. మేమేం తక్కువ తాగుతామా? అన్నట్లు పోటీ పడి మరీ తాగేశారు మద్యం ప్రియులు. అక్కడ కూడా మందుబాబులు 2024కు భారంగా వీడ్కోలు పలుకుతూ.. 2025కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. డిసెంబర్‌ 31వ తేదీ ఒక్కరోజే భారీగా మద్యం తాగేశారు. రాష్ట్రంలో 2024 డిసెంబర్‌ 22వ తేదీ నుంచి 31 వరకు పది రోజుల్లో భారీగా మద్యం సరఫరా అయ్యింది. రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్‌ మూడు సెలవు రోజులు మినహా మిగిలిన 7 రోజులు డిపోల నుంచి కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో న్యూ ఇయర్ కిక్కు గట్టిగానే కనిపించింది. డిసెంబరు 31వ తేదీ ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు దాదాపు రూ.200 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసిన జాబితాలో ఉన్నాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం షాపులు, బార్లు, క్లబ్బుల్లో డిసెంబర్‌ 31వ తేదీ అర్థరాత్రి మరో 2 గంటలపాటు అదనంగా విక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో, దాదాపు 14 గంటల పాటూ మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చింది. గంటకు సగటున రూ.14.28 కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది రూ.1500కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే.. ఈసారి అందుకు అదనంగా మరో రూ.200 కోట్లు కలుపుకొని రూ.1700కోట్ల విలువైన మద్యం విక్రయాలు కేవలం 7రోజుల్లోనే జరిగాయి. 31వ తేదీ ఒక్కరోజే 2.50 లక్షల ఐఎంఎల్‌ కేసులు, 75 వేల బీరు కేసులు అమ్ముడైనట్లు తెలుస్తోంది.దీని విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో మాత్రం రోజుకు రూ.80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి షాపులకు తరలించారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా అందుకు రెండు రెట్లు అధికంగా స్టాకును తరలించారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎక్సైజ్‌ శాఖ 24గంటల తనిఖీలు చేపట్టారు అధకారులు. దీంతో రాష్ట్రంలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com