ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సి వర్గీకరణ కొలిక్కి వస్తోంది. ప్రభుత్వం నియమించిన కమిషన్ ఈ రోజు ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు నివేదిక అందజేశారు. ఉమ్మడి జిల్లాల వారిగా విచారణ చేసిన కమిషన్ వర్గీకరణకు సంబంధించి వివిధ వర్గాలు అందించిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల్ని స్వీకరించి పరిశీలించింది.
ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీల్లో ఉపవర్గాల ఆర్ధిక స్వావలంబన తదితర అంశాలపై ఏక సభ్య కమిషన్ అధ్యయనం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్ధనలు , అభిప్రాయ సేకరణ జరిపిన ఏక సభ్య కమిషన్ వారి అభిప్రాయాలను సేకరించి…క్రోడీకరించింది.
ప్రభుత్వం దీన్ని మంత్రివర్గంలో చర్చించి శాసనసభ ఆమోదానికి పంపుతుంది. ఉభయసభల్లో చర్చ తర్వాత ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎస్సి వర్గీకరణ జరిగే వరకు రాష్ట్రంలో కొత్త నియామకాలు చేపట్టవద్దని మాదిగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.