- రేవంత్ రెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నాడు
- సీయం నాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే
- మీడియతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతారహిత్యంగా వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ నాపై, పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటయింపులకు సంబంధించి తనపై సీయం చేసిన ఆరోపణలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన నాటి నుంచి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని అయితే రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందక పంటల భీమా, ఆయుష్మాన్ భారత్ వంటి కొన్ని పథకాలను అమలు చేయలేకపోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చెయ్యడం లేదని ప్రజలు ప్రశ్నిస్తారనే వారి దృష్టి మళ్ళించేందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీని బ్లాక్‌మెయిల్ చేసినంత మాత్రాన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోదని రేవంత్‌రెడ్డి అర్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన రూ.10 లక్షల కోట్లకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండుసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ పై కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే అజ్ఞానులం కాదని స్పష్టం చేశారు. రేవంత్ మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఎవరున్నా మేము వారిని వ్యతిరేకించం.. అభివృద్ధికే పాటుపడుతామన్నారు. నాకు రాసిన ఉత్తరంలో ఆయా ప్రాజెక్టులకు గాను రూ.1.66,569 కోట్లు మంజూరు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారని కేంద్రం ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రానికి నిధులు రిలీజ్ చేసింది లేదుని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టులకు ఎంత కేటాయించారో వెల్లడించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రాసిన లేఖ చూసి సీనియర్ అధికారులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు తయారుచేసిందే మేము భూసేకరణకు సంబంధించి నిధులు జమ చేయాలని రేవంత్ కు నేను లెటర్ రాశాను… రాష్ట్ర ప్రభుత్వం రింగ్ రోడ్డుకు సంబంధించి రూ.వంద కోట్లు మాత్రమే కేటాయించిందని… రేవంత్ అడిగినా.. అడగకపోయినా ఆర్ఆర్ఆర్ పూర్తవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోకు తప్పకుండా కేంద్రం ఆమోదం వస్తుందని చెప్పారు. దక్షిణాదిలో సీట్లు తగ్గిస్తామని ఎక్కడా చెప్పలేదని దీనిపై అనవసర రాద్దాంతం చేయొద్దు కిషన్ రెడ్డి హితవు పలికారు.