26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

సంఘ్‌ లక్ష్యం సమాజ పరివర్తన – కాచం రమేష్‌

వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఘ్ కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి హైదరాబాదులో మీడియా ప్రతినిధులకు వివరించారు.

ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలకు చేరుకుంటున్న తరుణంలో సంఘ భావజాలం, సంఘ్ సిద్ధాంతాలను సమాజంలోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు, మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న వేళ అఖిల భారత ప్రతినిధి సభలు జరిగాయన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 51,570 స్థలాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దైనందిన శాఖలు 83,129 నడుస్తున్నాయని, వీటితో పాటు వారాంతంలో కొనసాగే 32,147 శాఖా మిలన్లు, 12,091 నెలవారీ శాఖలు నడుస్తున్నాయన్నారు. మొత్తంగా దైనందిన శాఖ, మిలన్లు, మండలితో కలిపి 1,27,367 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణలో మొత్తం 1,839 స్థలాలలో 3,117 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 392 కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని, వారంవారీ సాప్తాహిక్ మిలన్లు 382, నెలవారీగా 224 శాఖలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ కలిపి తెలంగాణలో 3,800 పైచిలుకు శాఖలు నడుస్తున్నాయని, స్లమ్స్‌లో సేవాబస్తీల పేరిట సంఘ కార్య విస్తరణ ప్రయత్నం జరుగుతోందంటూ తెలంగాణలోని పలు సేవాబస్తీలలో శాఖల ద్వారా 980కి పైగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇక బంగ్లాదేశ్‌లోని మైనార్టీలు, ప్రత్యేకించి హిందువులపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ అఖిలభారత ప్రతినిధి సభలో చేసిన తీర్మానం గురించి రమేష్ మీడియాకి తెలియజేశారు. ఇస్లామిక్ జిహాదీలు హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు, హిందువుల ఆస్తుల లూటీ, గృహదహనాలు తదితర పరిణామాలను, ఈ హింసాకాండను నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజం తీసుకోవలసిన చర్యల గురించి ప్రస్తావించారు. అదే సమయంలో పోర్చుగీసువారిపై పోరాడిన భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి అబ్బక్క 500వ జయంతిని సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబాళె విడుదల చేసిన ప్రకటన, గత ఏడాది రాణి అహల్యా బాయి 300వ జయంతి సందర్భంగా నిర్వహించిన సామాజిక సమరసత కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ల వితరణ గురించి వివరించారు.

నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్-డిసెంబర్-జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను అందిస్తామన్నారు. ఇదే కార్యక్రమాన్ని తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయితీలోను, ప్రతి బస్తీలోనూ, ప్రతి మూల మూలనా అందరినీ కలుపుకుని వెళ్లేలా కరపత్రం, పుస్తకం పంపిణీ ద్వారా నిర్వహిస్తామన్నారు. ఇంకా అనేక బస్తీలు, ఉపమండలాలు, బ్లాక్ స్థాయిలోను, నగరాలలో ప్రతి లక్షమంది ఒక యూనిట్‌గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని, ఇందులో స్థానిక నేతలు, హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.మనమంతా ఒక్కటేననే ఏకాత్మ భావనను, సమరసతను ప్రేరేపించేలా ప్రతి బ్లాక్‌లోను వివిధ సంస్థలు, మఠాలు, కులాల ప్రముఖ వ్యక్తుల భాగస్వామ్యంతో సామాజిక సద్భావన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇంకా, పర్యావరణ హితం, స్వదేశీ జీవన విధానాన్ని పాటించడం, సామాజిక అనుశాసనం, చట్టాలను పాటించడం, హిందూ కుటుంబాలను కాపాడటం వంటి అంశాలను తీసుకుని సామాజిక సద్భావన సదస్సులు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. అదే క్రమంలో జిల్లా కేంద్రాలు, నగర కేంద్రాలలో ప్రతిష్ఠిత వ్యక్తులు, యువకులతో సదస్సులు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో గ్రామగ్రామానికి శాఖను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముందే తెలంగాణలో ప్రతి ఉపమండలం, బస్తీలో అన్నింటా కలిపి శాఖల సంఖ్యను 4 వేలకు చేర్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com