- తిరుగు ప్రయాణం మొదలు
- మళ్ళీ రైళ్లు, బస్సుల రద్దీ
- ప్రైవేట్ బస్సుల బాదుడు
పండగ అయిపొయింది.. సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఆనందాలు ఆవిరయ్యాయ. బంధు మిత్రుల సందళ్ళ చప్పుళ్లు ఆగిపోయాయి. మళ్ళీ ఒక ఏడాదికి సరిపడా జ్ఞాపకాలను మోసుకుంటూ ఎక్కడి వాళ్ళక్కడకి భారంగా, బరువెక్కిన గుండెలతో తిరుగు ప్రయాణం పట్టారు.
మళ్ళీ ఎప్పటిలా బస్సులు కిట కిటలాడాయి. బస్టాండ్ లన్నీ కిక్కిరిసి పోయాయి. పిల్లా పాపలు , లగేజీలతో బస్సుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. తెలంగాణా, ఏపీ ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను తిప్పుతున్నాయి. స్పెషల్ బస్సుల పేరుతో వీరు కూడా ప్రైవేట్ వారికి దీటుగా రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల వారికి నిజమైన పండగలా మారింది. వారిష్టారాజ్యంగా మారింది. ఎవడు అడిగేవాడే లేడన్నట్టు
వారి వ్యవహారం మారింది. మాములు రోజుల్లో వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఉండే బస్సు టికెట్ డబుల్, త్రిబుల్ కూడా అమ్ముతున్నారు.
బస్సులో చోటు దొరికితే చాలు రా.. భగవంతుడా అని మొక్కుకుంటున్నారు. ఇకపోతే రైల్వేస్టేషన్లు రద్దీగానే ఉన్నాయి. మరోవైపు వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుపతి వెళ్లే రైళ్లు మరింత రద్దీగా మారాయి. పండగకి తోడు, ఇదీ తోడవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వాహనాల్లో వచ్చిన వాళ్ళు శని, ఆది వారాల్లో వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. విమాన టికెట్ల ధరలు ఇంకా ఆకాశంలో ఉన్నాయి. మొత్తానికి వచ్చినప్పుడు ఉన్న ఉత్సాహం వెళ్ళేటప్పుడు కనిపించడం లేదు. తప్పదన్నట్టు బయలుదేరారు.