కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ పోరాటమే ప్రధాన కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కులగణనపై నెగేటివ్ అఫిడవిట్‌లు ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు అంగీకరించడమంటే, కాంగ్రెస్ నిరంతర ఒత్తిడి ఫలితమేనని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల గుండె చప్పుడును విని, ఆయన కులగణన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కులగణన సమాజానికి “ఎక్స్-రే”లాంటిదని రాహుల్ అప్పుడే స్పష్టం చేశారని తెలిపారు. ఆయన సూచనలతోనే తెలంగాణలో కులగణన చేపట్టామని, ఇది దేశానికే ఒక మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని వివరించారు. ఒకటి.. జనగణనలో కులగణన నిర్వహించాలని, మరొకటి.. రిజర్వేషన్ల 50% పరిమితిని తొలగించాలన్న అసెంబ్లీ తీర్మానాలు కేంద్రం వద్ద ఉన్నాయన్నారు. జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి చేసిన ధర్నా కూడా కేంద ప్రభుత్వాన్ని కదిలించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్.. దీనిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని, కేంద్రమంత్రులతో కూడిన ఒక కమిటీ, అధికారులతో కూడిన మరో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
కులగణనలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయని చెప్పారు. రాష్ట్రంలో 57 ప్రశ్నలతో 8 పేజీల సమాచారాన్ని సేకరించినట్లు వివరించారు. ఇందులో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని, ఇది ఏకపక్ష కార్యక్రమంగా జరగలేదన్నారు. తెలంగాణ కులగణనలో దేశంలోనే ముందు వరుసలో నిలిచిందని పేర్కొన్నారు. కేంద్రంతో తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి, జాతీయ స్థాయిలో సర్వేకు సంబంధించి అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బలహీన వర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని రేవంతః అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల అమలుకు ఎవరితోనైనా కలసి పనిచేయడానికి సిద్ధమన్నారు.