38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

భారత్‌లో ఊబకాయ భారం

ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం అధిక బరువు సమస్య దేశంలోని ప్రజలను పట్టి పీడిస్తోంది. యువత, పిల్లలను కూడా ఈ సమస్య ప్రభావితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, ఊబకాయుల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది.

లాన్‌సెట్‌ జర్నల్‌ రిపోర్ట్‌ ప్రకారం, 2050 నాటికి దేశంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య 45 కోట్లకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 17.6 కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారు. ఇది కొనసాగితే అమెరికాను దాటేసే అవకాశముందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ వేగంగా విస్తరణ :

హైదరాబాద్‌లోని ఐటీ రంగ ఉద్యోగుల్లో స్థూలకాయం స్పష్టంగా కనిపిస్తోందట. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమలేమి వంటి కారణాలు దీనికి కారణంగా చెబుతున్నారు.

మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌ కీలకం :

వైద్య నిపుణుల సూచన మేరకు, ఊబకాయం నివారణకు ‘మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌’ అనేది ప్రధాన మార్గం. ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినాలి. సమయం అయిందని తినడం తప్పు. ఒంటరితనం, ఒత్తిడి, బోర్‌గా అనిపించడంతో తినడం మానుకోవాలి. భోజన సమయంలో టీవీ, మొబైల్‌ వంటి దృష్టి భ్రంశాలను నివారించాలి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలుసుకుంటూ తినాలి. ఆహారం నెమ్మదిగా, ఆస్వాదిస్తూ తినాలి. ఒకపూట ఎక్కువ తింటే, తదుపరి భోజనాన్ని తగ్గించాలి. క్యాలరీలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ. ఇవన్నీ కలిపి ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు.

యువత, పిల్లల్లోనూ పెరుగుతున్న స్థూలకాయం :

వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ రిపోర్ట్‌ ప్రకారం, ప్రాసెస్డ్‌, ప్యాక్‌ చేసిన ఆహారం వినియోగం, శారీరక కదలికల కొరత, టీవీ, మొబైల్‌లపై అధిక ఆసక్తి.. ఇవన్నీ పిల్లల్లో స్థూలకాయాన్ని పెంచుతున్నాయి. ఆటస్థలాలు తగ్గిపోవడమూ ఈ పరిస్థితికి మరింత తోడవుతోంది.

ఊబకాయం అంటే ఏంటి ?

శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే దాన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది బాడీ మాస్ ఇండెక్స్‌-BMI ఆధారంగా లెక్కగడతారు.

డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం BMI :

– 18.5 కంటే తక్కువ: తక్కువ బరువు
– 18.5–24.9: సాధారణ బరువు
– 25–29.9: అధిక బరువు
– 30పైగా: ఊబకాయం

ఊబకాయానికి ప్రధాన కారణాలు :

– జన్యుపరమైన అంశాలు
– అసమతుల ఆహార అలవాట్లు
– వ్యాయామం లేకపోవడం
– వాతావరణ ప్రభావాలు
– కొన్ని ఔషధాల వాడకం

ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు :

– టైప్–2 మధుమేహం
– రక్తపోటు
– గుండె సంబంధిత రుగ్మతలు
– ఫ్యాటీ లివర్
– మానసిక ఒత్తిడులు
– మహిళల్లో గర్భధారణ సమస్యలు

ఊబకాయాన్ని అధిగమించేందుకు వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు, సమాజం మొత్తం ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాల్ని ఇస్తాయన్న సూత్రాన్ని గ్రహించాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com