బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి బరి తెగింపుగా వ్యవహరిస్తోంది. హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించినందుకు ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుపై విచారణ పేరుతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్ ప్రభుత్వం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తూ తాత్కాలిక ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. చిన్మయ్ ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధిగా ఉన్నారు. అక్టోబర్ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుతో సహా 13 మందిపై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదైంది.
ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అక్టోబర్ 25న లాల్దిఘి ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండా ఎగురవేశారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. దీనికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి.
అక్టోబర్ నుంచి సనాతన్ జాగరణ్ మంచ్ చిట్టగాంగ్‌లో మైనారిటీల రక్షణ, హక్కులను డిమాండ్ చేస్తూ నిరసనలు మొదలుపెట్టింది. ఇందులో చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు పాల్గొని.. తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హిందూ మైనారిటీలు కోసం ఎనిమిది ప్రధాన డిమాండ్లపై గళాన్ని వినిపించారు. మైనారిటీలపై నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు, బాధితులకు పరిహారం, పునరావాసం, మైనారిటీ రక్షణ చట్టం అమలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు తదితర అంశాలపై గళం విప్పారు.
ఇస్కాన్ పై ఆంక్షలు విధించెందుకే ప్రభు జిని అదుపులోకి తీసుకున్నారని ఆ దేశ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.