- పెరిగిన శీతల గాలులు
- తెలుగురాష్ట్రాల్లో వణికిస్తున్న చలి
శీతాకాలం వచ్చిందంటే…ఒక మోస్తరు చలిలో ప్రజలు చక్కగా బయట తిరుగుతుంటారు. అంతగా చలి అనిపిస్తే స్వెట్టర్లు వేసుకుని ఇంటి నుంచి బయటపడతారు. పిల్లాపాపలతో అలా సినిమాలు, షికార్లు, షాపింగులకి వెళుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ ఏడాది ఎప్పుడూ లేనట్టుగా చలి విపరీతంగా పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు చలితో గజగజా వణికిపోతున్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. దీంతో మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో కూడా చలి గాలులు వీస్తున్నాయి. ద్విచక్రవాహనాలపై వెళ్లేవాళ్లు పలు అవస్థలు పడుతున్నారు. ఈవారంలో ఆదిలాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగర శివార్లు, ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం, అరకు, లంబసింగి ఇలా పలు చోట్ల చలి తీవ్రత అత్యల్పంగా 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతతో చలి అధికంగా కొనసాగుతోంది. గత వారం, పదిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. తిరుపతి, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేవాళ్లు విధిగా స్వెటర్లు, మంకీ క్యాప్ లు పట్టుకుని వెళ్లాలని, వెళ్లి వచ్చినవాళ్లు చెబుతున్నారు. పొగమంచు పడుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కి వెళ్లేవాళ్లు కొన్నిరోజులు ఆగడమే మంచిదని అంటున్నారు.
చలి కారణంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. జలుబు , దగ్గు అయితే రొటీన్ గా మారిపోయింది.. అయితే వీటికి తోడు కీళ్లనొప్పులు, చర్మ సమస్యలు బోనస్ అంటున్నారు. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత 6 డిగ్రీలు ఉంటే ఆంధ్రప్రదశ్ లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్ ఉంది.
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉదయం 10.30 వరకు మంచు కురుస్తూనే ఉంటోంది. మధ్యాహ్నం రెండు గంటలు మాత్రమే ఎండ కాయడంతో గిరిజనుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. చలి తీవ్రత కారణంగా వేడినీళ్లు తాగమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ వారం అరకులో చలి తీవ్రత 5.9 డిగ్రీలు నమోదు కాగా అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో 6 డిగ్రీలు నమోదయ్యింది. మంగళవారం తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా ఉంది. సిర్పూర్లో 6.3, సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7 డిగ్రీలు, మోయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 7.6 డిగ్రీలు, పటాన్ చెరులో 8.6 డిగ్రీలు, రాజేంద్రనగర్ లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో చలి తీవ్రత విపరీతంగా నమోదయ్యింది.