తెలంగాణ యువతను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పోరేషన్ నూతన కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. 200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏటీ సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. అక్కడే ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ యూనివర్సిటీ నిర్వహణలో సంబంధిత పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. రాబోయే రోజుల్లో ఏఐ అంటే తెలంగాణా… హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా దాన్ని తీర్చి దిద్దుతామని ఆయన పేర్కొన్నారు. రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందన్న మంత్రి శ్రీధర్‌బాబు.. అదే సమయంలో కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. యువత కొత్తగా ఆలోచించి వీటికి పరిష్కారాలను నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. ఆ దిశగా కృషి చేసే వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. హైదరాబాద్ అనగానే అందరికీ కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలే గుర్తుకొస్తాయని, కానీ.. ఇక్కడ అన్ని రంగాలకు చెందిన కంపెనీలున్నాయన్నారు. 100 నుంచి 120 కంపెనీలు ఇక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సేవలందిస్తున్నాయన్నారు. అన్ని రకాల పరిశ్రమలను స్థాపించేందుకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉందన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీకు కావాల్సిన నైపుణ్యమున్న మానవ వనరులను మేం అందిస్తామని, నిశ్చింతంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని శ్రీధర్‌బాబు కోరారు. ఇక, డీటీసీసీ భారత్ లో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ సుమారు 500 మందికి కొత్తగా ఉపాధి దొరకబోతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, వీటిలో అధిక శాతం తెలంగాణ యువతకు ఇవ్వాలని కోరగా అందుకు యాజమాన్యం అంగీకరించిందని.. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి. ఈ కార్యక్రమంలో డీటీసీసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రెనీ లారోకే మోరీస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లిన్ బిషప్ తదితరులు పాల్గొన్నారు