పర్యాటక శాఖలో తీసుకురావల్సిన సంస్కరణలపై అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 10 లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం…దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలన్నారు.
దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని స్పష్టం చేశారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించిన సీఎం…సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్దం చేయాలని స్పష్టం చేశారు.
జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలన్న సీఎం…సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని వివరించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్ లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.