39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

తెలంగాణ సీఎస్‌ రామకృష్ణారావు మావోడే – గుత్తిలో సంబురాలు

తెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్‌ సెక్రటరీగా గుత్తివాసి డాక్టర్ కె.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ పధవిలో ఆయన్ని నియమించడం తమకు గర్వకారణంగా ఉందంటున్నారు గుత్తివాసులు. ఒక చిన్న పట్టణంలో ఓనమాలు దిద్దిన బాలుడు.. ఇప్పుడు ఓ రాష్ట్ర పరిపాలన అధికారిగా వ్యవహరిస్తుండటం అందరికీ ప్రేరణ కలిగిస్తోందంటున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడి వారసుడు :

గుత్తి పట్టణంలోని కోట వీధిలో పుట్టిన రామకృష్ణారావు స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రమౌళీశ్వరరావు మనవడు. తండ్రి గురునాథరావు రైల్వే ఉద్యోగిగా పని చేశారు. తల్లి భాగ్యలక్ష్మి గృహిణి. తండ్రికి ఉద్యోగంలో బదిలీల కారణంగా దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలు మారిన కుటుంబం చివరకు హైదరాబాద్‌లో స్థిరపడింది.

గుత్తి నుంచే ప్రస్థానం.. ప్రపంచ శిక్షణతో పరిపక్వత :

రామకృష్ణారావు విద్యాభ్యాసం గుత్తి పట్టణంలోని పట్టు కేశవపిళ్లై ప్రభుత్వ పాఠశాల నుంచే మొదలైంది. అనంతరం శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్‌ స్కూల్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యను కొనసాగించారు. నాగార్జునసాగర్‌లో ఇంటర్‌, కాన్పూర్‌ ఐఐటీ నుంచి బీటెక్‌, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్‌, డ్యూక్‌ యూనివర్శిటీ (USA)లో ఎంబీఏ చేశారు. 1991లో ఐఏఎస్‌గా ఎంపిక అయ్యారు.

పదవుల్లో పరిపాలన చాతుర్యం :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సబ్‌ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌గా, గుంటూరు, అదిలాబాద్‌ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేశారు. విద్యాశాఖ కమిషనర్‌, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించారు. ఇప్పుడు రాష్ట్ర పరిపాలనకు ముఖ్యాధికారి అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 11 బడ్జెట్‌లు రామకృష్ణారావు పర్యవేక్షణలోనే రూపొందించడం ఓ రికార్డ్‌.

గర్వకారణంగా గుత్తి జ్ఞాపకాలు :

రామకృష్ణారావు కుటుంబానికి గుత్తి కోట వీధిలో ఒకప్పుడు సొంత ఇల్లు ఉండేది. కొత్తపేట ప్రాంతంలో భూములు కూడా ఉండేవి. ఇప్పుడు అక్కడ వాళ్ల కుటుంబసభ్యులెవరూ నివసించడం లేదు. 2014లో కుటుంబంతో కలిసి గుత్తికి వచ్చినప్పుడు రామకృష్ణారావు.. తాను చదివిన చిన్ననాటి పాఠశాలకు వెళ్లి గడిపిన ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ఆయన మిత్రులు గుర్తు చేసుకుంటున్నారు. తమవాడే అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com