36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

టీడీపీ… ఆపరేషన్‌ పులివెందుల

రాజకీయంగా వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిని నిరాయుధుడిని చెయ్యాలి… ఆయన చుట్టూ ఉన్న పరివారాన్ని దూరం చెయ్యలి… ప్రజల్లో వైఎస్‌ జగన్‌ కు ఉన్న ఛరిష్మాను నాశనం చేయాలి…  అసలు ఇవన్నీ కాదు… పులివెందులలో వైఎస్‌.జగన్‌ మూలాలు అన్నీ కట్‌ చెయ్యాలి. ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ టార్గెట్‌. ఆంధ్రప్రదేశ్‌లో నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎప్పటికైనా ప్రమాదకారే. మొన్న కూటమి కి పడ్డ న్యూట్రల్‌ ఓట్లలో ఓ నాలుగై శాతం అటు ఇటు అయితే తిరిగి జగన్‌ అధికారంలోకి వచ్చేయడం ఖాయం. అలా జరగకుండా ఉండాలంటే జగన్‌ ను రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టాలి. ఇలా జరగాలంటే పులివెందులలో జగన్మోహన్‌ రెడ్డిని వీక్‌ చేస్తే చాలన్నది ప్రస్తుతం టీడీపీ అవగాహన. ఆ మేరకు జగన్‌ సోదరిలు వైఎస్‌.షర్మిల, నర్రెడ్డి సునీతల వెన్నుదన్నుతో బీటెక్‌ రవి కార్యశీలతతో ఆపరేషన్‌ పులివెందులను ప్రారంభించింది టీడీపీ. అందులో భాగంగానే జగన్‌ చిన్నాన్న వైఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో మళ్ళీ కదలిక తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇటీవల కాలంలో వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షులు పలువురు అనేక కారణాలతో మృత్యువాత పడ్డారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించి వైఎస్‌ వివేకా హత్యకేసులో సాక్షుల మరణాలు అనుమానస్పద మరణాలుగా తీసుకుని కేసులు కూడా నమోదుచేసింది. ఇదే సమయంలో వివేకా కుమార్తె, జగన్‌ సోదరి నర్రెడ్డి సునీత కూడా సాక్షుల మరణాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. త్వరలో ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తానని, సీబీఐ విచారణ కోరతానని ఆమె వెల్లడించారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందుల వచ్చిన నర్రెడ్డి సునీత ఈ విషయాన్ని మీడియాకు చెప్పి వెళ్ళారు. ఈ పరిస్ధితుల్లో ఎలాగైనా వైఎస్‌.వివేకా కేసుపై సీబీఐ ద్వారా పునఃవిచారణ జరిపించాలని టీడీపీ తహతహలాడుతోంది. ప్రధానంగా పులివెందుల టీడీపీ నేత బీటెక్‌ రవి అయితే వివేకా హత్య కేసు పునః విచారణ క్రమంలో పులివెందులలో వైఎస్‌.జగన్‌ కు వెన్నుదన్నుగా ఉన్న నాయకులను ఈ కేసు ద్వారా జగన్‌ కు దూరం చెయ్యచ్చనే పన్నాగంలో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా జగన్‌ తరపున వైఎస్‌ అవినాష్‌ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పులివెందుల రాజకీయాన్ని చూసుకుంటారు. పులివెందుల ప్రజలకు జగన్‌ అనునిత్యం అందుబాటులో లేని లోటు తెలియకుండా అవినాష్‌రెడ్డి ఆ నియోజకవర్గం రాజకీయాలతో మమేకమైపోయి ప్రజలకు తలలో నాలుకలా జగన్‌ తరపున పనిచేస్తూ ఉంటారు.

ఇప్పుడు వివేకా హత్యకేసులో సాక్షులు మరణాలను సాకుగా చూపి ఆ హత్యకేసులో బెయిల్‌ మీద ఉన్న ముద్దాయిలందరి బెయిళ్ళు క్యాన్సిల్‌ చేయించాలనే సంకల్పంతో టీడీపీ, ఆ పార్టీ నాయకులు బీటెక్‌ రవి, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతలు పావులు కదుపుతున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఏదో రకంగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిలతో పాటు పులివెందుల్లో కీలక నేతలందరినీ ఇబ్బందుల పాలు చేస్తే జగన్‌ నియోజకవర్గ పరంగా వీక్‌ అయిపోతాడనేది ప్రత్యర్ధుల అంచనా. ఇదే సమయంలో జగన్‌ గనుక వీక్‌ అయితే ఇక భవిష్యత్‌ అంతా మాదే అన్న ధోరణిలో వైఎస్‌.షర్మిల భావిస్తున్నారన్న చర్చ కూడా నియోజకవర్గ ప్రజల్లో జరుగుతోంది. పులివెందుల ప్రజలు జగన్‌ని కాదనుకుంటే వైఎస్‌.రాజశేఖరరెడ్డి కుమార్తెగా తనకే పట్టం కడతారనేది షర్మిల ఆలోచనగా కనిపిస్తోందని ఆమె సన్నిహితులు సైతం చెపుతున్నారు.

అయితే ఇప్పటికే సీబీఐ ఈ కేసు విషయంలో విచారణ జరిపి ఛార్జ్‌ షీటు కూడా దాఖలు చేసింది. అటువంటి సందర్భంలో మళ్ళీ అదే సంస్ధతో పునఃవిచారణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ్ అదే జరిగితే ఇంతకాలం చేసిన విచారణను పక్కకు పెట్టి మళ్లీ వైఎస్‌ వివేకా హత్య కేసును మొదటికి తెచ్చినట్లు అవుతుంది. ఏదిఏమైనా వివేకా కేసులో అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చెయ్యడం వీలైతే వైఎస్‌.భారతికి కూడా ఈ కేసులో విచారణకు నోటీసులు ఇప్పించడం… ఏతావాతా పులివెందుల నియోజకవర్గంలో జగన్‌ పట్టును కోల్పోయేలా చెయ్యడమనే లక్ష్యాలతో టీడీపీ తరపున బీటెక్‌ రవి నాయకత్వంలో ఓ టిమ్‌ అకుంఠిత దీక్షతో పనిచేస్తోందని కడప జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com