29.7 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

మెట్రో స్టేషన్ల నుండి వాణిజ్య, నివాస సముదాయాలకు స్కైవాక్‌లు

పైవంతెనల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి, పాదచారుల భద్రత కోసం మొట్రో స్టేషన్ల నుంచి వివిధ వాణిజ్య, నివాస సముదాయాలకు స్కైవాక్‌ల నిర్మాణాలను ప్రోత్సహించాలని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల స్వర్ణ జయంతి భవన్‌లో నిర్వహించిన కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్రణాళికా సమావేశంలో ఈ మేరకు ఇద్దరు అధికారులు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజారావణా వ్యవస్ధను మెరుగుపరచాలనే ఉద్దేశంలో ఉన్న నేపథ్యంలో మెట్రో రైలు నుంచి సమీపంలోని భవనాలకు స్కైవాక్‌ల నిర్మాణాలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఈవిధంగా స్కైవాక్‌లు ఇప్పటికే పంజాగుట్ట, ఇర్రంమంజిల్‌, హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్ల నుంచి ఎల్‌ఆండ్‌టీ సంస్ధ నిర్మించిన వాణిజ్య సముదాయాలకు స్కైవాక్‌ల నిర్మాణం చేశారు. మొట్రో ఈ మూడు స్టేషన్లలో మెట్రో రైలు దిగిన వారు పక్కన ఉన్న మాల్స్‌ లోకి రోడ్డు మీదకు దిగకుండా నేరుగా స్టేషన్‌ నుంచి స్కైవాక్‌ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇదేవిధంగా రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్ లో 11 టవర్లలో నెలకొని ఉన్న  అనేక అంతర్జాతీయ సంస్థలలో పనిచేస్తున్న వారు సులభంగా చేరుకునే విధంగా రహేజా వారు ఒక అధునాతనమైన  స్కైవాక్ ని అనేక సౌకర్యాలతో నిర్మించారు. అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ ను ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న అన్ని రస్తాలను కలిపే విధంగా హెచ్ఎండీఏ వారు నిర్మించిన వలయాకారపు రోటరీ స్కైవాక్ మెట్రో ప్రయాణీకులకు, ఈ కూడలి రోడ్లు దాటే పాదచారులకు బాగా ఉపయోగపడుతోంది.

వీటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ల నుండి స్కైవాక్ నిర్మాణం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీనికి వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి ఇతర నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల వారి నుండి మంచి స్పందన వస్తోందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్ ల్యాండ్ మార్క్ మాల్ కు ఆ సంస్థ వారే స్కైవాక్ నిర్మిస్తున్నారు. అలాగే ఎల్ బీ నగర్ స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనంద నిలయం నివాస భవనాల సముదాయానికి వాసవీ గ్రూప్ వారు స్కైవాక్ నిర్మిస్తున్నారు. వాసవీ ఆనందనిలయం కాంప్లెక్స్ మొత్తం 25 ఎకరాలలో ఒక్కొక్క టవర్ లోను 33 అంతస్తులతో మొత్తం 12 టవర్స్ నిర్మాణంఅవుతున్నాయి. వాటిలో పెద్ద సంఖ్యలో నివసించబోతున్న అనేక కుటుంబాలకు ఈ స్కైవాక్ చక్కటి సౌకర్యం కల్పిస్తుంది. అదే విధంగా మరికొన్ని సంస్థలు నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్  పల్లి వంటి అనేక మెట్రో స్టేషన్ల నుండి ఈ తరహా స్కైవాక్ లు నిర్మించడానికి తమతో చర్చలు జరుపుతున్నారని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్ల నుండి ఇటువంటి స్కైవాక్ లు నిర్మించదలిస్తే వారు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ రిటైల్ అధికారి కె.వి.నాగేంద్ర ప్రసాద్ ను ఫోన్ నెంబర్ 9900093820 పై సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com