విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు గండికొడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ యుజిసి రెగ్యులేషన్స్-2025 ను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నట్టు రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. బుధవారం నాడు బెంగళూరులో జరిగిన ఆరు (బిజెపీయేతర) రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖను నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి బదులుగా ఆయన హాజరయ్యారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ల విద్యామంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. “ఇప్పటిదాకా విశ్వవిద్యాయాల ఉపకులపతుల నియామకాన్ని చీఫ్ సెక్రటరీ సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ చేపట్టేది.
అసలు రాష్ట్రానికి సంబంధమే లేకుండా విసిల నియామకం చేపట్టేలా డ్రాఫ్ట్ రూపొందించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉన్నత విద్యకు తెలంగాణా ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అవసరమైన చోట కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. ఉన్నత విద్యలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు అండగా నిలుస్తోంది” దీన్ని ప్రోత్సహించాల్సిందిపోయి ఆటంకాలు కల్పించడమేమిటని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. ఉప కులపతులుగా పరిశ్రమల అధిపతులను, బ్యూరోక్రాట్లను, బయటి వ్యక్తులను నియమించే అవకాశాన్ని కల్పించాలన్న డ్రాఫ్ట్ రెగ్యులేషన్ లోని ప్రతిపాదన పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఉన్నత విద్యా సంస్థల్లో మూడు వేల మంది విద్యార్థులుంటేనే గ్రేడింగులు ఇస్తామని, ఉన్నత గ్రేడ్లు వస్తేనే కేంద్ర ప్రోత్సాహకాలు అందుతాయన్న ప్రతిపాదనను కూడా శ్రీధర్ బాబు వ్యతిరేకించారు. ఇది ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు కలిగించే చర్య అని ఆరోపించారు. బిఏ, బికాం, బిఎస్సీ, బిబిసి లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలనడం పేదలను ఉన్నత విద్యకు దూరం చేసే ఆలోచనగా ఆయన అభివర్ణించారు.
దేశ సరాసరి ‘గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో’ కేవలం 28 శాతం మాత్రమే ఉంది. అంటే ఉన్నత విద్య చదవాల్సిన వయసులో ఉన్న యువతలో నూటికి 28 మంది మాత్రమే కళాశాలల్లో చేరుతున్నారు. ఈ రేషియోను పెంచాలంటే ఎంట్రన్సులలాంటి ఆలోచనలు ఆటంకాలు సృష్టిస్తాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇప్పటిదాకా వైస్ ఛాన్సలర్ల పదవీకాలం 3 సంవత్సరాలు ఉండగా యుజిసి రెగ్యులేషన్స్ లో 5 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. “జాతీయ విద్యా విధానం (NEP)-2020 ను రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొనడం చాలా సమస్యలను తీసుకొస్తుంది. డిగ్రీ కోర్సులకు ఏడాదిలో రెండు సార్లు అడ్మిషన్లు నిర్వహించాలంటే సిబ్బంది కొరత, మౌలిక సమస్యలు ఉంటాయి. ఒకే విద్యార్థి ఏక కాలంలో రెండు కోర్సులు చదవొచ్చన్న ప్రతిపాదన అమలు విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు అందజేయాలి. గ్రేడింగులకు అర్హత పొందకున్నా, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయకున్నా యుజిసి నిధులను విడుదల చేయమని పేర్కొనడం బెదిరింపు చర్యగా భావించాల్సివస్తోందని, ఆన్లైన్, కరెస్పాండెన్స్ కోర్సులకు అనుమతులివ్వమని చెప్పడం విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని” అని శ్రీధర్ బాబు తెలిపారు.
డ్రాఫ్ట్ యూజిసి రెగ్యులేషన్లు రాష్ట్రానికి అమోదయోగ్యంగా లేవని సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఇప్పటికే అధికారికంగా లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. విద్యకు సంబంధించిన ఏ ప్రతిపాదనలైనా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రెగ్యులేషన్లు రూపొందించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేసారు. యుజిసి రెగ్యులేషన్స్ -2025 లోని 15 అంశాలను వ్యతిరేకిస్తూ, అమలును నిలిపివేయాలని రాష్ట్రాల విద్యామంత్రులు, ప్రతినిధుల సమావేశం ధర్మేంద్ర ప్రధాన్ ను కోరుతూ తీర్మానం చేసింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలక్రిష్ణారెడ్డిలు హాజరయ్యారు.