-
రెండు దేశాల మధ్య శాంతి, సుహృద్భావమే లక్ష్యం
-
ఒకరినొకరు గౌరవించుకుని స్నేహ భావంతో మెలగాలి
-
ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరి జోక్యం కూడదు
-
అన్నింటికీ చర్చలే మూలం.. అదే అజెండా
-
సిమ్లాలో కీలక ఒప్పంద సూత్రాలివే..
-
కశ్మీర్ పై అంతర్జాతీయ జోక్యం ఉండరాదని భారత్ షరతు
-
అప్పట్లో అంగీకరించిన పాకిస్థాన్.. ఇప్పుడు యూ టర్న్
-
కశ్మీర్ పై బయటి దేశాల ప్రమేయాన్ని కోరడమే..
-
అందుకే యుద్ధ సన్నాహాల్లో పాక్
-
నియంత్రణ రేఖ దగ్గర హడావుడి, కవ్వింపు చర్యలు
-
యుద్ధమే వస్తే చిత్తు చిత్తుగా ఓడే పాక్
-
అయినా ఇంకా అదే దుర్బుధ్ధి..అదే కుటిల బుద్ధి..
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. పాక్ దుర్మార్గపు చర్యకు నిరసనగా భారత్ సింధు జలవనరుల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తే సిమ్లా ఒప్పందం రద్దు చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. అసలు ఏమిటీ సిమ్లా ఒప్పందం..
అది రద్దయితే ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు చిహ్నంగా కుదిరినదే సిమ్లా ఒప్పందం. 1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జల్ఫికర్ ఆలీ భుట్టో హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. 1971 నాటి యుద్ధంలో పాకిస్థాన్ ఓటమి బంగ్లాదేశ్ విభజనకు కారణమైంది. రెండు దేశాల మధ్య స్థిరమైన సామరస్య పూర్వక బంధం ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
సిమ్లా ఒప్పందంలో ఏముంది?
1972 జులై 2న భారత, పాకిస్థాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం తగ్గించడానికి, స్నేహ పూర్వక బంధాలు ఏర్పడటానికి ఉద్దేశించినదే సిమ్లా ఒప్పందం. గతం గతః అని అన్నీ… మరచిపోయి మళ్లీ స్నేహపూర్వకంగా కలసి మసలుకొని, ఇచ్చిపుచ్చుకునే సంబంధాల పునరుద్ధరణ దీని లక్ష్యం. ఉప ఖండంలో శాంతి నెలకొనడానికి ఇద్దరూ బాధ్యతాయుతంగా మసలుకొంటూ తమ సహజ వనరులు, ఇతర శక్తులను ఉపయోగించి స్వయం సమృద్ధిని సాధించుకోడానికి, ప్రజల సంక్షేమం కోసం పాటు పడాలని ఈ సిమ్లా ఒప్పందాన్ని రూపొందించారు.
కీలక సూత్రాలు :
- రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలని ఐక్య రాజ్యసమితి ఛార్టర్ మార్గదర్శకాలు, లక్ష్యాలే ముందుకు నడిపిస్తాయి.
- రెండు దేశాలు తమ మధ్య ఉన్న సమస్యలను, వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా శాంతిపూర్వకంగా పరిష్కరించుకుంటూ, ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో అడుగులేయాలని ఈ ఒప్పందం సూచిస్తోంది.
- రెండు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలపై ఏ దేశమూ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగరాదు. అలాగే రెండు దేశాల శాంతి, సామరస్య పూర్వక వాతవరణాన్ని దెబ్బతీసే, నియంత్రించే,విఘాతం కలిగించే సంస్థల జోక్యాన్ని వ్యతిరేకించాలి.
- అపరిష్కృత వివాదాలపై తదుపరి చర్చలకు అనువైన వాతావరణాన్ని కొనసాగించడం రెండు దేశాల బాధ్యత. ఇరువురి సార్వభౌమాధికారాలను, సమగ్రతను పరస్పరం గౌరవించుకుంటూనే ఇరువురి ఆంతరంగిక వ్యవహారాల్లో సమానత్వం, పరస్పర ప్రయోజనం పేరుతో జోక్యం చేసుకోరాదని సిమ్లా ఒప్పందం సూచిస్తోంది.
- పాతికేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న సమస్యలను, అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.
- రెండు దేశాల సార్వభౌమాధికారాలు, ప్రాదేశిక సమగ్రతలను రాజకీయ స్వాతంత్రాని గౌరవించుకోవాలి.
ఇవి ఓవరాల్‌గా ఐరాస ఛార్టర్ నిర్దేశించినవి కాగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంప్రదింపులే ఏ సమస్యకైనా పరిష్కారమని ప్రత్యేకించి వివాదాస్పద కశ్మీర్ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ జోక్యం కుదరదని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తూ వస్తోంది.
లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) :
సిమ్లా ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖగా మార్చారు. ఇది జమ్మూ కశ్మీర్ పై రెండు దేశాలకు సంబంధించిన డీ ఫాక్టో బోర్డర్. ఈ రేఖను రెండు దేశాలు ఏకపక్షంగా మార్చరాదని, దానిపై ఉన్న యధా తధ స్థితిని కొనసాగించాలన్నది సిమ్లా ఒప్పందం సారాంశం.
భూభాగాన్ని అప్పగించడంః ఇండో పాక్ యుద్ధ సమయంలో భారత్ స్వాధీనం చేసుకున్న 13 వేల కిలోమీటర్ల భూభాగాన్ని సిమ్లా ఒప్పందం ప్రకారం మన దేశం పాకిస్థాన్ కు అప్పగించేసింది. శాంతికి కట్టుబడి ఉన్నామని, ఒక సుహృద్భావ ధోరణిని చాటేందుకు భారత్ నిజాయితీగా భూభాగాన్ని అప్పగించింది. అయితే తుర్తుక్, ఛలుంకా, ఛోర్బన్ లోయ లాంటి వ్యూహాత్మకప్రాంతాలు భారత్ అధీనంలోనే ఉన్నాయి.
బంగ్లాదేశ్ గుర్తింపు :
1971 ఇండోపాక్ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్థాన్ బంగ్లా దేశ్‌గా అవతరించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌కు సహాయం అందించడమే కాక ఆ దేశానికి కావల్సిన అన్నిసహాయ సహకారాలు మన దేశం అందించింది. అయితే యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడి వెంటనే అంగీకరించకపోయినా బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని, దౌత్య పరంగా దాని గుర్తింపును పాకిస్థాన్ అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సిమ్లా ఒప్పందం రద్దు అన్న నిర్ణయం పాకిస్థాన్ కుటిల బుద్ధికి నిదర్శనం. ఎందుకంటే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, ఒత్తిడి వాతావరణం ఉన్న టైమ్ లో రద్దు చేయడం ఒప్పంద నియమాల్ని ఉల్లంఘించడమే..
ఆర్టికల్ 370 రద్దుతో మారిన పరిస్థితి :
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు స్తంభించిపోయాయి. అప్పటినుంచి పాకిస్థాన్ సిమ్లా ఒప్పందాన్ని గౌరవించకపోగా పదేపదే అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్నిలేవనెత్తి తన సహజ కుత్సిత బుద్ధిని పాక్ ప్రదర్శించింది.
దాయాది దేశం వ్యూహాత్మక ఎత్తుగడ :
సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా పాకిస్థాన్ వ్యూహత్మక ఎత్తుగడ వేసింది. తద్వారా కశ్మీర్ పై ఐక్యరాజ్య సమితి లేదా మూడో దేశ ప్రమేయాన్నిస్వాగతించి వివాదాన్ని మరింత జటిలం చేయాలన్నది పాక్ ఉద్దేశం.ఇక్కడ మూడో దేశం అంటే తన మిత్రదేశాలైన చైనా లేదా ఇస్లామిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్ ప్రమేయం కోరి విషయాన్ని అల్లరి చేయడం. ఇది సిమ్లా ఒప్పంద మూలసూత్రాలకే విరుద్ధం.
ఎల్‌ఓసీ దగ్గర ఉద్రిక్తతలు :
సిమ్లా ఒప్పందం రద్దు చేయడమే కాదు నియంత్రణ రేఖ దగ్గర అప్పుడే కవ్వింపు చర్యలు కూడా పాక్ మొదలు పెట్టేసింది. కాల్పులు జరపడం, అధీన రేఖ ఉల్లంఘనలకు పాల్పడటం,చొరబాటు యత్నాలతో మనల్ని రెచ్చగొట్టాలన్నది పాక్ ఉద్దేశం. ఇది సిమ్లా ఒప్పందాన్ని గౌరవించి హద్దుల్లో ఉండాలన్న అసలు లక్ష్యానికే తూట్లు పొడుస్తోంది.
సిమ్లా ఒప్పందం కుదిరినా రెండు దేశాల మధ్య సంబంధాలు మాత్రం సుహృద్భావ వాతావరణానికి రాలేదు. ఇరు దేశాల మధ్యా ఎన్నడూ సామరస్యత లేదు. సిమ్లా ఒప్పందం అమల్లో ఉండగానే 1999లో కార్గిల్ యుద్ధం వచ్చింది.1980ల్లో సియాచిన్ గ్లేసియర్ వివాదం రేగింది. 1984లో ఆపరేషన్ మేఘదూత్ తో సియాచిన్ గ్లేసియర్ ను భారత్ వశం చేసుకుంది. ఇది సిమ్లా ఒప్పందం ఉల్లంఘనేనంటూ పాకిస్థాన్ అప్పట్లో నానా యాగీ చేసింది. ఇరు దేశాల మధ్య సియాచిన్ ప్రాంతంపై స్పష్టమైన సరిహద్దు రేఖలు కానీ, ఒప్పందాలు కానీ లేవు. అది సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద ప్రాంతమే.సియాచిన్ వివాదం ఇప్పటికీ ఇద్దరికీ అత్యధిక ఖర్చుతో కూడుకున్న వ్యూహాత్మక ప్రాంతమే. ప్రకృతి వైపరీత్యాలు, మంచు చెరియలు విరిగి పడి సైనిక, ఆయుధ నష్టం జరుగుతూనే ఉంది.
ఉద్రిక్తతలు, అస్థిరత పెంచడమే ధ్యేయం :
ఇప్పుడు తాజాగా సిమ్లా ఒప్పందం రద్దు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడటమే కాదు యుద్ధానికి సిద్ధం అంటూ మన సహనాన్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు మనం కూడా అధీన రేఖ దగ్గర సైన్యాన్ని మోహరించక తప్పని పరిస్థితి. ఇది ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుంది. కశ్మీర్ పై శాంతి చర్చలకు ఉండే అవకాశాలను నేలమట్టం చేసేసింది.
యుద్ధమే వస్తే వాస్తవానికి పాకిస్థాన్ కు తట్టుకునే శక్తి లేదు. సైనిక పరంగా, ఆయుధపరంగా, ఆర్థిక పరంగా సాంకేతిక పరంగా కూడా అత్యంత బలహీనంగా ఉంది పాకిస్థాన్. అయినా ఒంటికాలిపై కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్థాన్ చర్యలకు ప్రతివ్యూహం దిశగా భారత్ సమాయత్తమవుతోంది