27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

మ్యూజియంగా శీష్‌ మహల్‌ – ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తొలి నిర్ణయం

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారిక నివాసాన్ని మ్యూజియంగా మారుస్తామని కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ‘శీష్‌ మహల్‌’గా కొన్నాళ్లుగా తీవ్రంగా చర్చల్లో నిలిచిన కేజ్రీవాల్‌ అధికారిక నివాసం ఎన్నికల సమయంలో వివాదాస్పదమయ్యింది. ఆ భవనం గురించి బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అందుకే మీడియా తొట్టతొలిగా రేఖా గుప్తాకు అదే ప్రశ్న సంధించింది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన మీరు ‘శీష్‌ మహల్‌’ బంగ్లాలోనే నివసిస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి రేఖా గుప్తా.. వెంటనే ‘లేదు.. లేదు’ అని సమాధాన మిచ్చారు. ఆ వెంటనే ‘శీష్‌ మహల్‌’ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు.

ఏంటీ ‘శీష్ మహల్‌’ కహానీ? :

ఢి్ల్లీ రాజకీయాల్లో మొన్నటి ఎన్నికల్లో ప్రభావం చూపిన అంశాల్లో ‘శీష్‌ మహల్‌’ ఒకటి. సివిల్‌ లైన్స్‌లోని 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌ బంగ్లా ‘శీష్‌ మహల్‌’ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే, కేజ్రీవాల్‌ హయాంలో ఆ మహల్‌ తీవ్ర వివాదాస్పదమైంది.

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన అధికార నివాసం 6, ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డు బంగళా విస్తరణ, మరమ్మతులు, అలంకరణల కోసం అధికంగా ఖర్చు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2015 నుంచి గత అక్టోబర్‌ వరకు ముఖ్యమంత్రిగా ఆ బంగళాలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నివసించారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ తన అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్‌లో గోల్డెన్‌ కమోడ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, మినీ బార్‌ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్‌ జరిగిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో ఆ బంగళాకు శీష్‌ మహల్‌ అని బీజేపీ పేరు పెట్టింది. శీష్ మహల్‌ అంటే అద్దాల మేడ. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్‌ తన నివాసాన్ని 7-స్టార్‌ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ.. తానేమీ అద్దాల మేడ, శీష్‌ మహల్‌ కట్టుకోలేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌ను ప్రధాని మోదీ ఇరకాటంలో పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ‘శీష్‌ మహల్‌’ అంశం కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచింది.

ఆప్‌ మోసాలకు శీష్‌ మహల్‌ ఓ ఉదాహరణ అంటూ బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీశాయి. భాజపాకు విజయాన్ని కట్టబెట్టాయి. అందుకే విమర్శలకు తావులేకుండా ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని భాజపా యోచిస్తున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దిల్లీకి కొత్తగా వచ్చే సీఎం అందులో ఉండకపోవచ్చని ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. వాటికి తగ్గట్టే రేఖా గుప్తా నుంచి స్పందన వచ్చింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com