ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ఈ మంత్రివర్గం సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో.. ఇప్పటికే ప్రకటించిన పలు పథకాలను త్వరలోనే అమలు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తల్లికి వందనం పథకం అమలు విషయంపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించారు. ఇక పోలవరం డయాఫ్రామ్ వాల్‌ను వెంటనే ప్రారంభించామని నిర్ణయించారు. రాధాజాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ భేటీలో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం పేదలకు ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇవే కాకుండా.. ఫ్రీ హోల్డ్ లాండ్స్‌పై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. 12 లక్షల ఎకరాలు విడుదలపై చర్చించారు. ఇన్‌చార్జి మంత్రులను జిల్లాల వారీగా మీటింగ్ పెట్టి, సమీక్ష చేసి, వచ్చే కేబినెట్ సమావేశానికి నివేదికలు తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయించారు.బడ్జెట్ సమావేశాలకు ముందు కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే టిడ్కో ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి స్థలాలు సేకరణపై నిర్ణయాలు తీసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు నిధులు ఇవ్వడంపై కేంద్రానికి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు ఇచ్చినా భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్ కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని కేబినెట్‌లో చర్చించారు. ఏపి మార్క్ ఫెడ్ రూ.700 కోట్ల రుణ సేకరణకు ప్రభుత్వ హామీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ధాన్యం సేకరణ కోసం ఈ నిధులు కేటాయించేలా నిర్ణయించింది. ఇప్పటికే రూ.6 వేల కోట్ల రుణానికి అదనంగా ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఏపి ఫెర్రో అల్లాయ్స్ విద్యుత్ సుంకం టారిఫ్ తగ్గింపు కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.300 కోట్ల భారం పడనుంది. 62 నియోజక వర్గాల్లో 63 అన్నా క్యాంటీన్ ల ఏర్పాటు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సొసైటి ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. తోటపల్లి బ్యారేజ్ లో కుడి ఎడమ వైపు మొత్తం 3 మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదించింది. కృష్ణా నది ప్రకాశం బ్యారేజీకి దిగువన కుడివైపు రక్షణ గోడ నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 294 కోట్ల తో తాడేపల్లి వైపు రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కడప జిల్లా కోప్పర్తి లో 2595 ఎకరాల , కర్నూలు లో 2621 ఎకరాల భూ బదలాయింపు నకు స్టాంపు డ్యూటీ మినహాయింపు నకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు తేదీ 2025 డిసెంబర్ 31 వరకూ పొడిగింపు నకు తీర్మానించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత స్థలాల లో 2019 అక్టోబర్ 15 వరకూ నిర్మించుకున్న నివాస గృహాలు క్రమబద్ధీకరణ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరణకు సంబధించిన పాత జీవోలు రద్దు చేసి.. కొత్త మార్గదర్శకాల తో జీవో జారీ కి నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయంల రేషనలైజేషన్ ప్రక్రియ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు కేటగిరీలుగా సచివాలయాలు, ఉద్యోగులను కేటాయించింది. 2500 జనాభా కంటే తక్కువ ఉన్న సచివాలయం పరిధిలో 6 గురు ఉద్యోగులు, 2500 నుంచి 3500 వరకూ జనాభా ఉన్న సచివాలయంలో పరిధిలో 7 గురు ఉద్యోగులు, 3500 జనాభా కంటే ఎక్కువ ఉన్న చోట్ల 8 మంది ఉద్యోగులను నియమించేందుకు నిర్ణయించింది. అలాగే రియల్ టైం గవర్నెన్స్ అమలుకు విజన్ 2047 సాధన కోసం గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫ్రీ హోల్డ్ భూములు, 22 ఏ నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు అంశంపై నివేదిక ఇవ్వాలని ఇంచార్జీ మంత్రులకు ఆదేశాలు జారీచేసింది. 13.6 లక్షల ఎకరాల భూములు ఫ్రీ హోల్డ్ చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేటు, ఆదాయం పెంపు పైనా కేబినెట్ లో చర్చ జరిగింది. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.