కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షకుడిగా భక్తకోటితో పూజలందుకుంటున్న శ్రీనివాసుడికి కోపం వచ్చిందా? అసలు అపచారం ఎక్కడ జరిగింది? మొత్తానికి తిరుమల క్షేత్రంలో వరుస దుర్ఘటనలకు కారణమేంటి? స్వామివారి విషయంలో అపచారం ఎక్కడ జరిగింది? ఇలాంటి అపశృతుల నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలి? ఇప్పుడీ అంశం తిరుమలలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదు.. శ్రీనివాసుడి భక్తులున్న ప్రపంచ దేశాల్లోనూ చర్చను లేవనెత్తుతోంది. ఎవరో చేసిన అపచారానికి మరెవరో బలవుతున్నారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. తిరుమలేశుడి కోపం తగ్గించే మార్గమేది? అన్న చర్చ శ్రీవారి భక్తుల్లో విస్తృతంగా జరుగుతోంది.
శ్రీనివాసుడికి కోపం వచ్చిందా?
ప్రపంచస్ధాయి శ్రీనివాసుడి పుణ్యక్షేత్రం తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో ఇటీవలి కాలంగా వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయి. పెద్దగా గ్యాప్ కూడా లేకుండా వెంట వెంటనే అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి దర్శన టికెట్ల క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాట సంఘటన నుంచి మొదలుకొని.. ఏదో ఒక అపశృతి దొర్లుతోంది. పలువురు భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. మరికొందరు గాయాల పాలయ్యారు. ఇంకొన్ని ఘటనలు స్వామివారి ఆగ్రహానికి పర్యవసానంగా వేద పండితులు చెబుతున్నారు.
లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు :
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో తయారు చేస్తున్న లడ్డూప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుస్తోందన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రప్రభుత్వమే ఈ వివాదాన్ని తెరపైకి తేవడం, వివాదం సృష్టించడం అప్పట్లో భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసిందన్న వాదనలున్నాయి. అప్పటినుంచీ తరచూ ఏదో ఒక సంఘటన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుగుతుండటం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది.
తిరుమల చరిత్రలోనే అతిపెద్ద విషాదం :
ఇక, పవిత్రమైన వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులకు టోకెన్లు జారీ చేసే క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. ఈనెల 8వ తేదీన ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 41 మంది భక్తులు గాయపడ్డారు. ఈ పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అతిపెద్ద విషాదం అనేది రికార్డులు చెబుతున్నాయి.
పరకామణిలో అగ్నిప్రమాదం :
ఇక, క్యూలైన్లలో తొక్కిసలాట సంఘటన షాక్ నుంచి భక్తులు తేరుకోకముందే.. తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారుచేసే పరకామణిలో అపశృతి చోటు చేసుకుంది.
ఘాట్‌రోడ్డులో బస్సు ప్రమాదం :
ఆ తర్వాత తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం సంభవించింది. ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. అదృష్టవశాత్తూ ఆ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.
మూడేళ్ల బాలుడు దుర్మరణం :
ఈనెల 15వ తేదీన తిరుమలలోని వసతి సముదాయంలో మూడేళ్ల బాలుడు భవనంపైనుంచి పడి దుర్మరణం పాలయ్యాడు. కడప చిన్న చౌక్‌కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈ నెల13వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు. ఈనెల 16వ తేదీన దర్శనం టోకెన్లు లభించడంతో 15వ తేదీన తిరుమల కొండపైకి శ్రీనివాసులు కుటుంబం చేరుకుంది. ఆర్టీసీ బస్టాండ్‌లోని పద్మనాభ నిలయంలో శ్రీనివాసులు కుటుంబం లాకర్ తీసుకొని అక్కడ సేద దీరింది. అయితే, సాయంత్రం పద్మనాభ నిలయం వసతి సముదాయంలో శ్రీనివాసులు ఇద్దరు కుమారులు ఆడుకుంటున్న క్రమంలో శ్రీనివాసులు రెండో కుమారుడు సాత్విక్ ప్రమాదవశాత్తూ కాలు జారీ వసతి సముదాయం రెండవ అంతస్థు నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన సాత్విక్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు. అంతా మంచి జరగాలని శ్రీవారి దర్శనం కోసం వస్తే.. అదే తిరుమల సన్నిధిలో కొడుకు మృతి చెందడంతో శ్రీనివాసులు ఫ్యామిలీ కన్నీరుమున్నీరుగా విలపించింది.
తిరుమల కొండపై ఎగ్ బిర్యానీ, బాధ్యులెవరు? :
ఇక, కలియుగ వైకుంఠం తిరుమలకు కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ తీసుకురావడం, కొండపై తినడం అక్కడి భద్రత వైఫల్యానికి అద్దం పట్టినట్టయింది. తమిళనాడు రాష్ట్రం గుమ్ముడిపూండికి చెందిన 23 మంది తిరుమలకు వస్తూ పెద్ద క్యారియర్ నిండా కోడిగుడ్ల బిర్యానీ తమ వెంట తెచ్చుకున్నారు. వారు బస్సులో అలిపిరి వద్ద చెకింగ్, లగేజ్ స్కానింగ్ దాటుకుని తిరుమలకు చేరుకున్నారు. రాంబగీచా అతిథిగృహం సమీపంలోని బస్టాండ్ వద్ద బస్సు దిగి అక్కడే కోడిగుడ్ల పలావ్ తినడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని కొందరు భక్తులు గుర్తించి సమీపంలోని పోలీస్ కాంప్లెక్స్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే వచ్చి గుమ్ముడిపూండికి చెందిన వారి వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలకు ఇలాంటి ఆహారం తీసుకురాకూడదని పోలీసులు మందలించారు. టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం నిఘా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఘాట్‌రోడ్డులో కారు బోల్తా :
తిరుమలలో అపశృతుల పరంపర కొనసాగుతోంది. తిరుమల ఘాట్‌రోడ్డులో ఇవాళ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 7వ మైలు దగ్గర శ్రీవారి ప్రయాణీకులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో చిన్నారులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బోల్తా పడింది. దీంతో, కారులో ఉన్న వాళ్లు గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అదే దారిలో వెళ్తున్న తోటి వాహనదారులు వెంటనే టీటీడీ సిబ్బందికి, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, టీటీడీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఆ రోడ్డులో వెళ్తున్న మిగతా ప్రయాణీకులు వీడియో తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్వామివారు శాంతించేదెట్లా?
అతి కొద్దిరోజుల్లోనే.. అదీ ఈనెలలో కేవలం పదకొండు రోజుల వ్యవధిలోనే ఇన్ని అపశృతులు చోటు చేసుకోవడం శ్రీవారి భక్తులను కలవరపెడుతోంది. శ్రీనివాసుడి ఆగ్రహం చల్లారాలని భక్తులు మొక్కుకుంటున్నారు. ఎవరో అపచారానికి పాల్పడితే, ఆయన భక్తులకు ఇబ్బందులు కలిగించడం వద్దని శాంతించాలని స్వామివారిని వేడుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. ఈ అపశృతులను తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్వామివారిని శాంతపరిచేదిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.