బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. మైమెన్‌సింగ్, దినాజ్‌పూర్ జిల్లాల్లోని మూడు హిందూ దేవాలయాలలో ఎనిమిది విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. వరుస దాడులు ఇప్పుడు అక్కడి హిందూవులను కలవర పెడుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందూవులను, హిందూ ఆలయాలను వరుసగా టార్గెట్ చేసుకోవడం చూస్తుంటే.. దుండగులు చెప్పకనే మీకిక్కడ స్థానం లేదని చెబుతున్నట్టుగా కనిపిస్తోంది.
మైమెన్‌సింగ్‌లోని హలుఘాట్ సబ్‌జిల్లాలో గురు, శుక్రవారాల్లో వేర్వేరు ఘటనల్లో రెండు ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇక శుక్రవారం తెల్లవారుజామున షాకుయ్ యూనియన్‌లోని బొండెర్‌పారా ఆలయంలో రెండు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. గురువారం తెల్లవారుజామున బీల్‌దొర యూనియన్‌లోని పోలాష్‌కండ కాళీ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దినాజ్‌పూర్‌లోని బీర్‌గంజ్ సబ్‌జిల్లాలో మంగళవారం ఝర్బరీ షషన్ కాళీ ఆలయంలో ఐదు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇవన్నీ వేరు వేరు వ్యక్తులు చేసినట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఒకరిని అరెస్ట్ చేయడం.. అతడు నేరాన్ని అంగీకరించడం.. పోలీసులు అతడిని జైలుకు పంపడం జరిగిపోయాయి.
ఓవైపు దాడులు జరుగుతుండగానే హిందూవులపై నమోదవుతున్న కేసులు కూడా పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మైనారిటీలపై హింస పెరిగినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది హిందువులు, ఇతర మైనారిటీలపై 2,200 దాడులు జరిగాయి. అదే సమయంలో పాకిస్థాన్ లో 112 దాడులు మాత్రమే జరిగాయి. దీన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌గా మారిందని తెలుస్తోంది.
నిజానికి బంగ్లాదేశ్‌లో హిందూ, ముస్లిం అనే భావన ఎక్కువగా కనిపించకపోయేది. 2022 వరకు చాలా తక్కువ దాడులు హిందువులపై జరిగాయి. తరవాత సొంత ప్రజాప్రభుత్వంపై కుట్రలు చేసుకున్న అక్కడి పార్టీలు.. అధికారంలో ఉన్నవారిని కూల్చేందుకు హిందూవులపై రాజకీయాలు మొదలుపెట్టాయి. హసీనా ప్రభుత్వం హిందూవులకు కొమ్ము కాస్తుందంటూ విద్వేష పూరిత ప్రకటనలు, స్పిచ్‌లు మొదలుపెట్టారు. దీంతో హసీనాపై ద్వేషంతో పాటు.. హిందూవులను కూడా వేరుగా చూడటం మొదలైంది. ఇక అప్పటి నుంచి దాడులు పెరగడం మొదలైంది. ఈ విద్వేషం కారణంగానే ఈ ఒక్క ఏడాదే 2,200 దాడులు హిందువులపై జరిగినట్లుగా తెలుస్తోంది. విద్వేషాలను మరింత రెచ్చగొట్టేందుకు ఇప్పుడు ఆలయాలను కూడా పక్కా వ్యూహం ప్రకారమే దాడులు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
దీనంతటిని తెరవెనుక నుంచి జమాత్ ఏ ఇస్లామీ ఎగదోస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలు అమెరికా నిఘా సంస్థలకు అందినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా, యూరోప్ దేశాల్లోని బంగ్లాదేశ్ పౌరులు దేశంలో మతోన్మాద శక్తుల అరాచకాలపై ఇటీవల ఆందోళనలు నిర్వహించారు. బంగ్లాదేశ్ ను మతోన్మాద శక్తులు శాసించాలని చూస్తున్నాయని, దేశంలో హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.