- మెట్రో ఫేజ్ -IIను జేవీగా చేపట్టాలి…
- మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించండి..
- హైదరాబాద్, వరంగల్ డ్రైనేజీ స్కీంలకు నిధులు ఇవ్వండి..
- కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశ పట్టణ జనాభాలో 8 శాతం ప్రజలు తెలంగాణలో ఉన్నారని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. పీఏఎంవై (యూ)… పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీయం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డాటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. దేశంలోని మహా నగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్‌లో మెట్రో కనెక్టవిటీ తక్కువగా ఉందని… ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్-II కింద ఆరు కారిడార్లను గుర్తించామని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందులో కారిడార్ -IV: నాగోల్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), కారిడార్ -V: రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), కారిడార్-VI: ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), కారిడార్-VII: మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ.), కారిడార్-VIII: ఎల్ బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ), కారిడార్- IX: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) (40 కి.మీ.) ఉన్నాయని.. ఇందులో మొదటి అయిదు కారిడార్లకు సంబంధించి (76.4 కి.మీ.) డీపీఆర్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి ఖట్టర్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయమవుతుందన్నారు. డీపీఆర్లు ఆమోదించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం (జేవీ) కింద చేపట్టి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
అలాగే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు చేయూతనివ్వాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీలో మురుగు చేరకుండా నదికి ఇరువైపులా 55 కి.మీ. (మొత్తంగా 110 కి.మీ.) కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఇందుకోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు సమీపంలోని 27 పట్టణ పాలక సంస్థల పరిధిలో మురుగు నీటి నెట్‌వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (సీఎస్ఎంపీ) తయారు చేశామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సీఎస్ఎంపీని గుర్తించి నిధులు సమకూర్చాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేసిందని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. వరంగల్ నగరంలో రూ.41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు…
ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి అభినందనలు…
తెలంగాణ రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అభినందనందించారు. ప్రధానమంత్రి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలంటున్నారని, అందులో తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు.