ఎప్పటికప్పుడు పరిస్ధితులను సమీక్షిస్తున్న సీయం రేవంత్‌రెడ్డి
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు రెండోరోజు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండీ పర్యవేక్షించారు. సహాయక చర్యల్లో ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలొద్దని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల అంతా బురదగా ఉండటం, టీబీఎం యంత్రం పైభాగం కుంగిపోవడం, ఇతర పరికరాలు అడ్డంగా ఉండటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. టీబీఎం యంత్రం సమీపం వరకు చేరుకున్న ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పేర్లు పెట్టి పిలిచినా చిక్కుకుపోయిన వారి నుంచి స్పందన రావడం లేదు. శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటర్ వద్ద శనివారం ఉదయం కార్మికులు పనుల్లో ఉన్న సమయంలో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే కొందరు బయటపడగా యంత్రానికి అటువైపున ఉన్న 8 మంది చిక్కుకుపోయారు. వారిని సన్నీసింగ్, గురుప్రీత్ సింగ్, సంతోష్ సాహు, అనూజ్ సాహు, జక్తాజస్, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్‌గా గుర్తించారు. అయితే సొరంగంలో వస్తున్న నీరు సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. టన్నెల్‌లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.